మునుగోడు ఉపఎన్నికల (Munugode Bypoll) రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy), బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి (Palvai sravanthi) ఎన్నికల బరిలో ఉన్నారు. త్వరలోనే వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఐతే రాజకీయ నేతలతో పాటు పలు వర్గాల ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నామినేషన్ల రూపంలో నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. ఈ ఉపఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసి.. తమ సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయాలని.. వీఆర్ఏలు యోచిస్తున్నారు. వారితో పాటు లారీ యజమానులు, చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులు, కళాకారులు కూడా నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలయింది. చండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. తొలిరోజు వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. నిన్న 49 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల సెట్లను తీసుకెళ్లారు. వీరిలో 12 మంది వీఆర్ఏలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చాలా రోజులుగా ఆందోళనలు విషయం తెలిసిందే. అటు లారీ యజమానులు కూడా ట్యాక్స పెంపును నిరసనగా ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నారు. నిన్న ఇద్దరు లారీ ఓనర్లు నామినేషన్ సెట్లను తీసుకెళ్లారు. సోమవారం లోపు లారీ ఓనర్స్ రాష్ట్ర కమిటీ సమావేశమై.. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అది అమలుకాకపోవడంతో.. కొందరు కళాకారులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 300 మంది కళాకారులు నామినేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ భూనిర్వాసితులు కూడా ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. మర్రిగూడెం మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన 80 మంది రైతులు రిజర్వాయర్ కోసం 2115 ఎకరాల భూమిని ఇచ్చారు. భూ పరిహారం ఇప్పటికే చెల్లించారు. కానీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.7.61 లక్షలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ రాలేదు. ఇందుకోసం రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఐనప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో... మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికలకు నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలయింది. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్లను లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana