మునుగోడులో (Munugode Bypoll) ఓట్ల పండగను ఘనంగా జరుగుతోంది. అన్ని పార్టీల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలు ఊరూరా సందడి నెలకొంది. మందు పార్టీలు, విందు భోజనాలు, డబ్బుల పంపిణీతో అంతటా పండగ వాతావరణం కనిపిస్తోంది. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు ప్రజాశాంతి పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ జనసమితి కూడా బరిలోకి దిగుతున్నాయి. అంతేకాదు తెలుగు దేశం పార్టీ కూడా మునుగోడు పోరుకు సిద్ధమవుతోంది. మునుగోడు ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrbabu Naidu) ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ ఉపఎన్నికల్లో పోటీచేయాలని చంద్రబాబు నిర్ణయించారని.. ఇవాళ రేపో అభ్యర్థిని ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
మునుగోడు బరిలో టీడీపీ నుంచి జక్కలి ఐలయ్య యాదవ్‌ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు అధికారిక ప్రకటన చేయనున్నారు. బీసీ వర్గానికి చెందిన ఐలయ్య ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ నేతగా ఆయనకు మంచి పట్టు ఉంది. మునుగోడులో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జక్కలి ఐలయ్య వైపే తెలంగాణ టీడీపీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఐతే ఉపఎన్నికల్లో ఐలయ్య యాదవ్‌కు మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేయకపోవచ్చని సమాచారం.
Munugodu: మునుగోడులో ఎలక్షన్ డిమాండ్ ..హైదరాబాద్‌లో కూడా లేనంత ఇంటి కిరాయి
మునుగోడులో టీడీపీ పోటీపై మంత్రి హరీష్ రావు స్పందించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీకి లాభం చేసే కుట్రలో భాగంగానే టీడీపీ మునుగోడులో పోటీ చేస్తుందని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో మునుగోడులోని మర్రిగూడెం మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీపై ఆయన విరుచుకుపడ్డారు.
మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 32 మంది నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్టోబరు 10న నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. నామినేషన్ సందర్భంగా బల ప్రదర్శన చేయనుంది టీఆర్ఎస్. నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలను తరలిస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి అక్టోబరు 14న నామినేషన్ వేస్తారు. ఆ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతారు.
కాగా, మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్లు రేపటితో ముగియనున్నాయి. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే ఆఖరి రోజు. అక్టోబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్లను లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu Naidu, Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana