మునుగోడులో ఎన్నికల (Munugode Bypoll) ప్రచారం తారాస్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులంతా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఐతే మునుగోడులో మొత్తం ఎంత మంది ఓటర్లున్నారన్న దానిపై స్పష్టత వచ్చింది. మునుగోడు ఉపఎన్నికకు తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఐతే శుక్రవారం అధికారులు చెప్పిన లెక్కలకు.. శనివారం విడుదల చేసిన జాబితాకు స్వల్ప వ్యత్యాసం ఉంది. మునుగోడులో మొత్తం 2,41,367 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో స్త్రీల సంఖ్య 1,19,859, పురుషుల సంఖ్య 1,21,501గా ఉంది. ఇతరులు ఏడుగురు ఉన్నారు. జనవరి 1, 2022 నాటికి మునుగోడు నియోజకవర్గంలో 2,27,268 మంది ఓట్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 14,099 పెరిగింది.
మండలాల వారీగా ఓట్ల లెక్కలు చూస్తే.. నారాయణపురంలో 36,430, మునుగోడులో 35,887, చౌటుప్పల్లో 35,511, నాంపల్లిలో 33,820, మర్రిగూడలో 28,155, చండూరులో 22,517, గట్టుప్పల్లో 14,413 ఓట్లు ఉన్నాయి. ఇక చౌటుప్పల్ మునిసిపాలిటీలో 23,908, చండూరు మునిసిపాలిటీలో 10,726 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారమే నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తారు.
ఇక మునుగోడు ఉపఎన్నికల్లో మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఐతే శనివారం స్క్రూటినీ చేసిన ఎన్నికల అధికారులు.. నిబంధనల మేరకు లేని 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగతా 83 మంది నామినేషన్లను ఆమోదించారు. ఇక నామినేషన్లకు రేపటి గడువు ముగుస్తుంది. ఎవరైనా విత్ డ్రా చేసుకోవాలని అనుకుంటే సోమవారం వరకు అవకాశం ఉంటుంది. విత్ డ్రాల అనంతరం.. తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఇక కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ మనుగడలో లేనందున..ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన నామినేషన్ను ఎన్నికల అధికారులు ఆమోదించారు.
కాగా, మనుగోడులో నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగిసింది. అక్టోబరు 14 వరకు నామినేషన్లను స్వీకరించారు. 15న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్లను లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana