మునుగోడు ఉపఎన్నికలపై (Munugode Bypolls) తెలుగు దేశం పార్టీ (TDP) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. మునుగోడు (Munugodu) నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటన విడుదల చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. రేపటితో నామినేషన్లు ముగియనుండడం, ఎన్నికలకు పార్టీ సంసిద్ధంగా లేకపోవడం వల్ల టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మునుగోడుఉపఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణియించిందని... జక్కలి ఐలయ్య యాదవ్‌ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయని ఇవాళ ఉదయం వరకు ప్రచారం జరిగింది. పార్టీలో ఆయన పేరే ప్రధానంగా వినిపించింది. బీసీ వర్గానికి చెందిన ఐలయ్య ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ నేతగా ఆయనకు మంచి పట్టు ఉంది. మునుగోడులో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జక్కలి ఐలయ్యను రంగంలోకి దించుతోందని.. ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటికి తెరదించుతూ.. టీడీపీ కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది.
మరోవైపు మునుగోడులో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నువ్వానేనా అన్నట్లుగా ఇంటింటికీ కలియతిరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) ఈ నెల 10 నామినేషన్ వేశారు. ఇవాళ అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరానున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి (Palvai Sravanthi Reddy) నామినేషన్ల ఆఖరు రోజున అంటే.. మంగళవారం నామినేషన్ వేస్తారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్రవంతి నామినేషన్ కార్క్రమానికి హాజరవుతారు.
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీలు కూడా బరిలోకి దిగుతుండడంతో మనుగోడు ఉపఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఇక మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్లు రేపటితో ముగియనున్నాయి. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే ఆఖరి రోజు. అక్టోబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్లను లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election, TDP, Telangana