• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • MUNICIPAL MINISTER KTR AND UNION HOME MINISTER KISHAN REDDY LAID THE FOUNDATION STONE FOR ANOTHER KEY PROJECT IN HYDERABAD BN

హైదరాబాద్‌ అభివృద్ధిలో కీలక మలుపు.. రూ.426 కోట్లతో కొత్త ప్రాజెక్టు..

శంకుస్థాపన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, కేటీఆర్

ఈ ప్రాజెక్టు కింద రూ.350 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు 2.62 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి వయా వీఎస్‌టీ, ఆజామాబాద్ వీదుగా బాగ్‌లింగంపల్లి వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.

 • Share this:
  ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా.. అక్కడ రహదారులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. రవాణ సదుపాయం ఎంత సౌకర్యవంతంగా ఉంటే.. అంత వేగంగా అభివృద్ది జరుగుతుంది. అందులోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా శనివారం రూ.426 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్, రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు నిర్మించే మూడు లైన్ల ప్లైఓవర్ పనులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

  ఈ ప్రాజెక్టు కింద రూ.350 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు 2.62 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి వయా వీఎస్‌టీ, ఆజామాబాద్ వీదుగా బాగ్‌లింగంపల్లి వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా హైద‌రాబాద్ న‌గరాభివృద్దికి ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష‌ల మేర‌కు హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ది చేసేందుకు మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌ కోసం ఎస్ఆర్డీపీ ద్వారా రూ.6వేల కోట్లు, స్కైవేలు, అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్టు తెలిపారు.

  బెంగ‌ళూరు లాంటి మెట్రో న‌గ‌రాల్లో నేడు నెల‌కొన్న ట్రాఫిక్ స‌మ‌స్య‌తో పెట్టుబ‌డుదారులు ఆయా న‌గ‌రాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వెనక‌డుగు వేస్తున్నార‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్ పిరియ‌డ్‌లో నాలుగు రేట్ల వేగంతో ప‌ది నెల‌లు ప‌ట్టే ప‌నుల‌ను రెండు నెలల్లోనే పూర్తిచేసిన‌ట్లు తెలిపారు. ట్రాఫిక్ త‌క్కువగా ఉన్నందున లాక్‌డౌన్‌ను స‌ద్వినియోగం చేసుకున్న‌ట్లు తెలిపారు.

  ర‌సూల్‌పుర‌లో చేప‌ట్టిన ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన కొంత స్థ‌లాన్ని ఉప‌యోగించుకునే అంశంలో కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు. నాగ్‌పూర్, రామ‌గుండం వెళ్లే ర‌హ‌దారుల‌ను అభివృద్ది చేసేందుకు ర‌క్ష‌ణ రంగానికి చెందిన భూమిని కేటాయించే అంశంలో స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.ఈ మార్గాల్లో రూ. 5వేల కోట్ల‌తో 18 కిలోమీట‌ర్ల చొప్పున రెండు స్కై వేల‌ను నిర్మించుట‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించిన‌ట్లు తెలిపారు. ఈ రెండు స్కైవేల పొడ‌వు 36 కిలోమీట‌ర్లు ఉంటుంద‌ని తెలిపారు.

  కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌ర‌మైన హైద‌రాబాద్ చాలా వేగంగా అభివృద్ది చెందుతున్న‌ద‌ని పేర్కొన్నారు. గ‌తంలో న‌గ‌రంలో జ‌న‌సాంద్ర‌త క‌లిగిన ప్రాంతంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉండేద‌ని తెలిపారు. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా ఈ ఎలివేటెడ్ కారిడార్‌, ఫ్లైఓవ‌ర్ల‌కై అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌తో అనేక సార్లు చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. కానీ కార్య‌రూపం దాల్చ‌లేద‌ని పేర్కొన్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ను చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు, పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావుల‌కు సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలిపారు.

  ఈ ప‌నుల‌తో ఆర్టీసి క్రాస్ రోడ్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌న‌సాంద్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో రోడ్ల విస్త‌ర‌ణ‌, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణంతో అభివృద్దికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని తె‌లిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అభివృద్ది స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. అంత‌ర్జాతీయ న‌గ‌రంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
  Published by:Narsimha Badhini
  First published: