Venu Medipelly, News18, mulugu
ఆనాడు దిగవంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల చెల్లమ్మ అంటూ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుండి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా
ఈనాడు సీతక్క అంటూ తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు నుండి ఈ యాత్రను మొదలుపెట్టారు. భారతదేశ వ్యాప్తంగా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ యాత్రకు కొనసాగింపుగానే తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాత్ యాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ యాత్రను ములుగు నియోజకవర్గ నుంచి ప్రారంభించారు.
మొదటగా రేవంత్ రెడ్డి ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయంలో గట్టమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. సీతక్క రేవంత్ రెడ్డికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రేమ్ నగర్ సమీపంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. వనదేవతల సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోలాహలం కనిపించింది. మొదటగా రేవంత్ రెడ్డి ఎత్తు బెల్లం వనదేవతలకు సమర్పించారు. మేడారం మనదేవతల సన్నిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి అనే నినాదాలతో మేడారం మారుమోగిపోయింది.
అనంతరం ప్రాజెక్ట్ నగర్ సమీపంలో నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగింది.
అడవి ప్రాంతం నుంచి పస్రా గ్రామం వరకు అందర్నీ కలుస్తూ చేయి చేయి కలుపుతూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగింది. అనంతరం పస్రా గ్రామంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల జల్లు కురిపించారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని దక్కించుకోవాలని అనుకుంటుందని ఆరోపించారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ సందేశం స్ఫూర్తిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించింది. మేడారం నుంచే ఈ యాత్ర మొదలు పెట్టడానికి ఒక కారణం ఉంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలు నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారు.
అందుకే సమ్మక్క సారక్క అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యాం. అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే. వైఎస్ చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే..ఈ యాత్ర విజయవంతం అయినట్లే. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోంది. తెలంగాణ కోసం అమరుల ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తోంది. అమరుల త్యాగాలను ఈ ప్రభుత్వం మట్టి కప్పాలని చూస్తోంది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన సమ్మక్క సారక్క పోరాడిన గడ్డ ఇది. సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ ఇదని పేర్కొన్నారు.
అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా? నోటిఫికేషన్ల వేయకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? 25 లక్షల కోట్లు ఎటు పోయాయి? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది.. వాస్తవం కాదా? తెలంగాణలో 10 శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా? రైతులు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలి. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana