(Venu Medipelly,News18,mulugu)
అందరు శాకాహారులే... మాంసం కూర మాయమైంది అన్నట్టుగా ఉంది లక్నవరం(Laknavaram)లో పరిస్థితి. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటాయి లక్నవరం పరిసర ప్రాంతాలు. జులై(July)నెల నుంచి ఫిబ్రవరి వరకు పచ్చని చెట్లతో ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతో ఆహ్లదం పంచుతుంది. లక్నవరం లేక్(Lake)ను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబంతో సహా వస్తుంటారు పర్యాటకులు. ఈక్రమంలో లక్నవరంకు వచ్చే పర్యాటకుల కోసం అటవీ శాఖ(Forest Department)ఇక్కడకు సమీపంలోనే జింకల పార్కు(Deer park)ను ఏర్పాటు చేసింది. ఈ జింకల పార్కులో దాదాపు 25 పైగా జింకలు ఉన్నాయి. లక్నవరం వచ్చే పర్యాటకులకు ఇది అదనపు వినోదంగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలకు ఆటవిడుపు కోసం పచ్చని అటవీ అందాల మధ్య ఏర్పాటు జింకల పార్కు అందాలను తిలకించడానికి ఫారెస్ట్ అధికారులు వాచ్ టవర్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.
సాయంత్రం అయితే పార్టీలే ..
కానీసోమవారం సాయంత్రం కొందరు యువకులుఅదే వాచ్ టవర్ పై మద్యం సేవిస్తూ న్యూస్ 18 కెమెరాకు చిక్కారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ఈ టవర్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఒకవైపు మహిళలు, చిన్నారులు కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి ఆనందంగా గడుపుతుంటే మరోవైపు యువకులు ఇలా మద్యం సేవించడం కలకలం సృష్టించింది. ఈ విషయంపై న్యూస్ 18 ప్రతినిధి రేంజ్ ఆఫీసర్‌కి సమాచారం ఇవ్వగా \"జింకల పార్కులో మద్యపానం అస్సలు అనుమతి లేదని... వెంటనే దీనిపై యాక్షన్ తీసుకుంటామని\" అధికారులు తెలిపారు. అయితే మద్యం తీసుకుని యువకులు పార్కు లోపలికి వెళ్లడం సిబ్బంది పర్యవేక్షణ లోపమా లేదా అక్కడ పని చేస్తున్న సిబ్బంది కళ్లుగప్పి ఆ యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి మద్యాన్ని లోపలికి తీసుకువెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. ఏదో విధంగా మద్యాన్ని పార్కులోనికి తీసుకెళ్లినా ఆ యువకులు దర్జాగా టవర్ పై అందరికీ కనిపించేలా మద్యం సేవించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.
పనిచేయని సీసీ కెమెరాలు:
జింకల పార్కులో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని బీట్ ఆఫీసర్ తెలిపారు. కానీ కోతుల బెడద వల్ల సీసీ కెమెరాలు ఏ ఒక్కటి కూడా పనిచేయడం లేదటా. చిన్నారులు, పర్యాటకుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పార్కులో ఇలా యువకులు మద్యం సేవించడం పార్కు సిబ్బంది పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై సదరు బీట్ ఆఫీసర్ తో మాట్లాడగా \"గత నాలుగు సంవత్సరాల నుంచి మా పరిధిలో అలాంటి సంఘటనలు జరగలేదని, అసాంఘిక కార్యకలాపాలను సహించమని\" చెప్పుకొచ్చాడు. కానీ అందరూ శాఖాహారులే మాంసం కూర మాయమైంది అన్నట్టుగా ఇలా అధికారులు, సిబ్బంది తమ వంతు భాద్యతగా మాట్లాడుతున్నా... యువకులు మద్యంతో లోపలికి ఎలా వచ్చారు, వాచ్ టవర్ పైకి ఎలా ఎక్కారనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటాడు వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana News