Home /News /telangana /

MULUGU WHY THESE TRIBALS LIVING IN THE AGENCY AREA CLOSE TO FOREST AND AWAY FROM THE MODERN WORLD EVEN AFTER 75 YEARS OF INDEPENDENCE MMV PRV BRV

Mulugu: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా అడవికి దగ్గరగా.. ఆధునిక ప్రపంచానికి దూరంగానే వారి జీవనం..

గిరిజనులు

గిరిజనులు

ఆ కోయలు బయటి ప్రపంచానికి దూరంగా అడవి తల్లికి దగ్గరగా జీవిస్తున్నారు. సమీప గ్రామాల్లో సాధారణ కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. స్వతంత్ర భారతంలోనూ వారి జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి?

  (Venu Medipelly, News18, Mulugu)

  'గుత్తి కోయ (Guthi koya)'.... గిరిజన జీవన జాతుల్లో భాగమైన ఈ పేరును తరుచూ వెంటూనే ఉంటాం. సుదూరపు అడవుల్లో నివాసాలు ఏర్పరుచుకుని ఆధునిక జీవితానికి దూరంగా ఉంటూ.. అడవి తల్లినే నమ్ముకుని ఈ గుత్తి కోయలు జీవనం సాగిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కోయలుగా వీరి జీవితాలు మాత్రం మారలేదంటే వీరు ఎటువంటి పరిష్టితుల్లో ఉన్నారో అర్ధం చేసుకోవాలి. తూర్పు కనుమల్లో ఈశాన్యంగానున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాష్ట్రాల్లోని చిట్టడవుల్లో జీవించే వారు. అయితే దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు, సల్వాజుడుం దళాల మధ్య జరుగుతున్న పోరాటాల్లో తీవ్రంగా నలిగిపోయిన గుత్తి కోయలు..అక్కడి నుంచి క్రమంగా వలస వెళ్లారు. అలా దాదాపు 30 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, తూర్పుగోదావరి, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వలస వచ్చారు. వేల సంఖ్యలో వలస వచ్చిన వీరిని అడవి తల్లే అక్కున చేర్చుకుంది. గుత్తి కోయల గిరిజనుల (Tribes) జీవన విధానం ఏవిధంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం న్యూస్ 18 చేస్తుంది.

  ములుగు జిల్లా పరిధిలో నివాసాలు ఏర్పరుచుకున్న గుత్తి కోయలు..

  తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న చత్తీస్‌ఘడ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి జీవనం కోసం అనేక మంది గిరిజనులు తెలంగాణ అడవులకు చేరుకున్నారు. ములుగు (Mulugu) జిల్లా అటవీ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. పొట్ట చేత పట్టుకొని, బ్రతుకు జీవుడా అంటూ వచ్చిన కోయలు, బయటి ప్రపంచానికి దూరంగా అడవి (Forest) తల్లికి దగ్గరగా జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ సమీప గ్రామాల్లో సాధారణ కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. వలస వచ్చిన వీరికి ప్రభుత్వం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి వంటివి ఇచ్చినా కనీస మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు.

  కూలి పనులే ఆధారం: చుట్టుపక్కల గ్రామాల్లో రోజువారి పనికి వెళ్లే వీరు రూ. 350 నుంచి 500 ఇచ్చే కూలి పనులు చేస్తుంటారు. పొలం పనులు, సిమెంట్ పని, భవన నిర్మాణ పనులు, తోట పనులకు వెళ్తుంటారు. పనులు లేని సమయంలో అడవిలో దొరికే ఇప్ప పువ్వు, ఇప్ప గింజలు, తునికి కాయలు, పాలా పండ్లు, కరక్కాయలు, తేనె వంటి వాటిని అమ్ముకుంటూ జీవిస్తుంటారు. వీరు తయారు చేసే ఇప్ప పువ్వు సారాకు విశేష ఆదరణ ఉంటుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన తరువాత శరీరం అలసిపోయిన సమయంలో మాత్రమే ఈ ఇప్ప సారా సేవిస్తారు. బయటి వక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం కుదరదని చెప్తున్నారు.

  శ్రమ దోపిడీ: సమీప గ్రామాల్లో కూలి పనులను నమ్ముకునే జీవిస్తున్న వీరిని అక్కడి యజమానులు శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారు. రోజంతా పనిచేసినా ఒక్కోసారి కూలీ డబ్బులు ఇవ్వకుండా పంపిస్తున్నారు. వలస వచ్చిన కొత్తలో కేవలం రూ. 300 కూలి మాత్రమే ఇచ్చి పని చేయించుకునేవారు. అలా వచ్చిరాని కూలి డబ్బులతో జీవనం సాగక, వీరు కూడా సొంతంగా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఆధునికతకు దూరంగా..ఆదివాసులు నివాసం ఉండే ప్రాంతంలో చుట్టూ పోడు కొట్టుకొని వ్యవసాయం చేస్తుంటారు. పోడుభూముల్లో కాయగూరలు, మొక్కజొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ గుత్తి కోయలు.

  అటు అడవి తల్లిని వదలలేక, ఇటు ఆధునిక జీవనానికి అలవాటు పడలేక, మనుషుల్లో ఉన్నా లేనట్టుగా జీవన పోరాటం సాగిస్తున్నారు ఈ గుత్తి కోయలు. అడవి తల్లిపై ఆధారపడ్డ వీరు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అడవికే అంకితం అవుతున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Forest, Local News, Mulugu, Tribes

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు