Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. నేటికీ అటవీ ప్రాంతంలోని గ్రామాలకు ఆ గ్రామ ప్రజలు రహదారి చూడని పరిస్థితి నేటికీ మనకు కనిపిస్తుంది. దశాబ్దాల కాలం నుంచి రోడ్డు సదుపాయం లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ రావాలంటే కూడా రాలేని గ్రామాలు నేటికీ మన ములుగు జిల్లాలో ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి గిరిజన గ్రామాలు సరియైన రోడ్డు లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఐలాపూర్ గ్రామం పరిస్థితి దారుణంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఐలాపూర్ గ్రామం ఉంటుంది.
ఎన్టీ రామారావు (NTR) ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఐలాపూర్ గ్రామానికి ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ అభివృద్ధి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఐలాపూర్ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ గ్రామానికి చేరుకోవాలంటే దట్టమైన అటవీ ప్రాంతం గుండా రెండు వాగులను దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో వాగులు పొంగడంతో ఈ గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. ఐలాపూర్ గ్రామ ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసినప్పటికీ అటవీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు.
దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంది ఐలాపూర్ గ్రామస్తుల పరిస్థితి. ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసినప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే దశాబ్దాల కాలం నుండి రోడ్డు కలగానే మిగిలిపోతుంది. ఐలాపూర్ గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సమ్మక్క జాతర జరుగుతూ ఉంటుంది.
ఈ జాతరకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి రహదారి కష్టాలు తప్పవు. జాతర సమయంలో ఐటిడిఏ ఏటూర్ నాగారం ద్వారా తాత్కాలిక పద్ధతిలో రోడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అటవీ అధికారులు రహదారి కోసం అనుమతులు ఇవ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అనుమతులు ఇస్తారా? లేక గిరిజిన ప్రజల కల కలగానే మిగిలిపోతుందా వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana