(Venu Medipelly,News18,mulugu)
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడే సిద్ధంగా ఉండేందుకు అధికార టీఆర్ఎస్(TRS), ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు కాలు దువ్వుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మిగులుతున్న ములుగు(Mulugu) నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆదివాసీ మహిళ నాయకురాలిని ఢీ కొట్టాలంటే ఇంకో ఆదివాసి మహిళా నాయకురాలిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ములుగు నియోజకవర్గంపై పట్టు సాధించడానికి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కోసం చాపకింద నీరులా పార్టీ అధిష్టానం సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రధానంగా వినిపిస్తున్న పేరు బడే నాగజ్యోతి(Bade Nagajyothi).
న్యూస్18 పొలిటికల్ థాట్:
ములుగు నియోజకవర్గంలో తెరాస పాత్ర..తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత మొదటిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి అజ్మీర చందూలాల్, కాంగ్రెస్ నుంచి పోదెం వీరయ్య, తెలుగుదేశం పార్టీ నుంచి అనసూయ (సీతక్క) పోటీ పడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం మొదటి ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ప్రజలు తెరాస అభ్యర్థి అజ్మీర చందూలాల్ కు (2014లో) పట్టం కట్టారు. ఈ ఎన్నికలలో సీతక్క కు వచ్చిన ఓట్లు కేవలం 25.81 శాతం మాత్రమే. అయితే 2018 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ఎన్నికల్లో దనసరి అనసూయ ( సీతక్క) కాంగ్రెస్ కండువా కప్పుకొని విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తెరాస నాయకులు ఆశించిన రీతిలో ములుగును అభివృద్ధి చేయలేదని తెరాస నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతోనే కేవలం ప్రజలు సీతక్కను గెలిపించారని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారట.
ములుగు స్థానంపై టీఆర్ఎస్ గురి ఎలా ఉండనుంది:
2018 ఎన్నికల్లో ములుగు ఓటర్లు భిన్నమైన తీర్పును వెలువరించినా, సీఎం కేసీఆర్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లా ఏర్పటు చేశారు. ఈ హామీ నెరవేర్చడంతో ఇదే ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ములుగు నియోజకవర్గంలో తెరాస జెండా ఎగురవేయాలని అధిష్టానం ఆలోచిస్తుంది. ములుగు నియోజకవర్గంలో ఆదివాసి ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయట. బడే నాగజ్యోతి ప్రస్తుతం తాడువాయి జడ్పీటీసీగా ములుగు జిల్లా మొట్టమొదటి మహిళా వైస్ చైర్ పర్సన్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కాల్వపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచిగా గెలిచిన ఘనత కూడా బడే నాగజ్యోతికి ఉంది. విద్యావంతురాలు కావడంతో పార్టీ విధివిధానాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ జనాకర్షణ నేతగా అతి తక్కువ కాలంలో ఎదిగారు. కాబట్టి ఒక ఆదివాసి మహిళా నాయకురాల్ని ఎదుర్కోవడానికి ఎలాగూ ఇంకో ఆదివాసి మహిళ నాయకురాలు కావడంతో ఎక్కువ అవకాశం బడే నాగజ్యోతికే ఉందని, అధిష్టానం ఆమెకు అండగా ఉంటే ఈసారి నియోజకవర్గంలో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
సీతక్కను ఓడించేవారెవరు?:
ఈసారి ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానాన్ని తెరాస అధిష్టానానికి బహుమానంగా ఇస్తామని ములుగు టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి ఉదాహరణగా ములుగులో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఇందుకు నిదర్శనమని నాయకులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ప్రజల సమస్యలపై అధికార టీఆర్ఎస్ తో పోరాటం చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క, ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి దనసరి అనసూయ ( సీతక్క) ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2009 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు నియోజకవర్గం పై సవతి తల్లి ప్రేమ చూపించింది. 2014లో తెరాస అభ్యర్థి గెలిచిన ఆశించినంత రీతిలో ములుగును అభివృద్ధి చేయలేకపోయారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క గెలిచినా, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిజయోజకవర్గ అభివృద్ధికి అధికార టీఆర్ఎస్ ఏ మాత్రం సహకరించక పోవడంతో, ఇప్పుడు కూడా ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మరి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు ఉంటారు, ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తారు?. ములుగు నియోజకవర్గం టీఆర్ఎస్ కు దక్కేనా? వంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, MLA seethakka, Mulugu