Venu, News18, Mulugu
గిరిజన మహిళలు రోజువారి కూలీలుగా పనిచేస్తే వారి దినసరి ఆదాయం రూ.150 నుంచి రూ.200 రూపాయలు మాత్రమే ఉంటుంది. దాంతో వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించాలి, పిల్లలను చదివించాల్సి ఉంటుంది. వారు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని, సంపాదించాలని, తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలలను కొందరు గిరిజన మహిళలు మాత్రమే సహకారం చేసుకునే దిశగా ప్రయాణిస్తారు. అలాంటి మహిళలే ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ములుగు జిల్లా (Mulugu District) ఏటూరు నాగారం ప్రాంతంలో అనేకమంది గిరిజనులు కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి గిరిజన మహిళలు కూడా లక్షల రూపాయల్లో వ్యాపారం చేస్తారని ఎవరైనా ఊహించగలరా? కానీ ఇది అక్షర సత్యం. నాడు వ్యవసాయ కూలీలు నేడు మాత్రం మహిళా వ్యాపారవేత్తలుగా ఎదిగిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏటూరు నాగారం పరిధిలోని మహిళలకు ఉపాధి విషయంలో ఐటీడీఏ ముఖ్యపాత్ర పోషిస్తోంది. పొడెం యశోద మరియు 11 మంది గిరిజన మహిళలు కలిసి స్వయంకృషి యూనిట్ అనే పేరుతో ఒక వ్యాపార సంస్థను స్థాపించారు. దీనికి ఐటీడీఏ సాయం అందించింది. దీంతో వారు ఇప్పుడు లక్షల్లో వ్యాపారం చేస్తూ ఇతర గిరిజన మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఏటూరు నాగారం ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తోంది. ఇక్కడ నివసించే గిరిజన ప్రజలకు ఐటిడిఏ వెన్ను దన్నుగా నిలుస్తోంది. ఏటూరు నాగారం కేంద్రంగా 12 మంది మహిళలు స్వయం కృషి యూనిట్ స్థాపించి రెండు రకాల పోషక విలువలతో కూడిన పదార్థాలను తయారు చేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు, గిరిజన వసతి గృహాలకు సరఫరా చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 గిరిజన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడింది.
స్వయంకృషి యూనిట్ గురించి గిరిజన మహిళల మాటల్లో.. “ గతంలో రోజువారి కూలి పనులకు వెళ్తే రూ.150 నుంచి రూ.200 రూపాయలు మాత్రమే వచ్చేవి. వాటితో కుటుంబ పోషణ, పిల్లల చదువులు చాలా కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో తెలియక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. ఇంతలోనే ఐటీడీఏ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిసి 12 మంది మహిళలం గ్రూపుగా ఏర్పడి ఐటిడిఏకు దరఖాస్తు పెట్టుకున్నాం. వెంటనే స్పందించిన ఐటీడీఏ అధికారులు 40 లక్షల రూపాయలతో డ్రై మిక్స్డ్ యూనిట్ మంజూరు చేసి ఉపాధి మార్గం చూపించారు.” అని వివరించారు.
రెండు పోషకాహార పదార్థాల తయారీ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా..
ఈ యూనిట్లో గిరిజన వ్యాపారవేత్తలు జోహార్ మిల్, మల్టీ గ్రైన్ మిల్ తయారు చేస్తున్నారు. వీటి తయారీలో జొన్నలు, శనగపప్పు, వేరుశనగ, జీలకర్ర, కొర్రలు, పెసరపప్పు, మొలకెత్తిన విత్తనాలతో ఈ పదార్థాలను తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు అత్యంత పోషక విలువలతో ఉండటంతో గిరిజన ప్రాంతాలలోని అంగన్వాడి కేంద్రాలలోని చిన్నపిల్లలకు సరఫరా చేస్తున్నారు. దీంతో వీరు లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ గిరిజన మహిళా వ్యాపారవేత్తలుగా ఎదిగామని చెప్తున్నారు. ఇప్పటివరకు వీరు దాదాపు రూ.15 లక్షల టర్నోవర్ చేయగా.. ప్రస్తుతం తయారీ కోసం వివిధ ఆర్డర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు.
పౌష్టిక ఆహారం కావడంతో ఎక్కువగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మధుమేహం వ్యాధితో బాధపడే వారికి ఈ పదార్థాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని గిరిజన మహిళా వ్యాపారవేత్తలు చెప్తున్నారు. ఉపాధి మార్గం చూపించడంలో మాకు అండగా నిలబడిన ఐటిడిఏ ఏటూరు నాగారం అధికారులకు మేము రుణపడి ఉంటామని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఎవరికైనా ఈ జోహార్ మిల్, మైగ్రేటర్ మీల్కావాలంటే 7993411473 నంబర్ ను సంప్రదించి ఆర్డర్ చేస్తే చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తామని వారు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana