Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) ఏజెన్సీ ప్రాంతంలో అనేకమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ విద్యార్థులకు విద్య ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. ప్రతి విద్యార్థి మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం ఉండాలంటే తప్పకుండా క్రీడలపై మంచి పట్టు సాధించాల్సిందే. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడా అంశాలలో కూడా తమ యొక్క అద్భుత నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటారు. గిరిజన పాఠశాలలో చదువుకునే విద్యార్థులు జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఏటూరు నాగారం పరిధిలోని చిన్న బోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు పలు జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని తమ అద్భుత ప్రతిభ ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
కేవలం ఈ ఒక్క పాఠశాల నుంచే దాదాపు 20 మంది విద్యార్థులు అనేక క్రీడా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు. గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడా పోటీలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ ఆశ్రమ పాఠశాలకు చెందిన కే నితిన్ వర్మ అనే విద్యార్థి షాట్ పుట్ విభాగంలో జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. అఖిల్ అనే విద్యార్థి 100 మీటర్ల పరుగు పందెం పోటీలలో జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నారు. అంతేకాకుండా వాలీబాల్ ఖో ఖో కబడ్డీ క్రీడా పోటీలలో సైతం విద్యార్థులు వారి యొక్క ప్రతిభ కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.
ఇది చదవండి: బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖించిన భక్తురాలు.
మాకు చదువుతోపాటు క్రీడ పోటీలు అంటే ఎంతో ఇష్టమని మాకు మరింత సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం లక్ష్యంగా ముందుకు వెళ్తామని విద్యార్థులు చెప్తున్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు అత్యంత పేదరికం నుంచి వచ్చినప్పటికీ చదువుతోపాటు క్రీడా పోటీలలో తమ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని వారికి మరింత ప్రత్యేక శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే లక్ష్యంగా వారికి శిక్షణ ఇస్తున్నానని చెప్తున్నాడు. సహజంగా ఆశ్రమ పాఠశాలలు అనగానే అతి నిరుపేద గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించడమే కాకుండా క్రీడా పోటీలలో తమ అద్భుత ప్రతిభను కనబరుస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana