Venu, News18, Mulugu
భారత్ జోడో యాత్ర (Bharath jodo Yatra) కు కొనసాగింపుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) హాత్సే హాట్ పేరుతో ములుగు (Mulugu) నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, ఈ యాత్ర ములుగు నియోజకవర్గంలో రెండు రోజులు కొనసాగింది. చివరి రోజు ములుగులో బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వంపై, భారతీయ రాష్ట్ర సమితిపై తనదైన శైలిలో మాటలతో విరుచుకుపడుతున్నారు. రెండో రోజు యాత్రలో భాగంగా ములుగు జిల్లా వేదికగాసంచల వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.
యాత్రలో భాగంగా రెండో రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి భవన్ పదెకరాల విస్తీర్ణంలో 110 గదులతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారని.. కానీ ప్రగతి భవన్ పేద ప్రజలకు ఉపయోగపడదన్నారు. ఆ భవనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని భవనాన్ని నక్సలైట్లు పేల్చేయాలన్నారు. గతంలో మావోలు దొరల గడీలను పేల్చి వేసినట్టు ప్రగతి భవన్ ను కూడా పేల్చివేయాలని.. నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ములుగు జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకులు ములుగు పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ములుగులో జరిగిన తన పాదయాత్ర, రోడ్ షోలో భాగంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం, ప్రభుత్వ అధికారిక కార్యాలయం అయినటువంటి ప్రగతి భవన్ ను డైనమైట్లతో పేల్చివేయాలని.. అలా పేల్చివేస్తే తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. బహిరంగంగా ప్రభుత్వంచే నిషేదించబడిన నక్సలైట్లకు బహిరంగ పిలుపును ఇవ్వడం హేయమైన చర్యని.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రాణానికి హాని చేయడం కోసం నక్సలైట్లతో జరిగిన లోపాయికారి ఒప్పందం, కుట్రలో భాగమేనని తమకు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ బహిరంగ పిలుపు వెనక మాజీ నక్సిలైట్ అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే సీతక్క మధ్యవర్తిత్వాన్ని నెరపినట్లుగా భావిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, సీతక్క అలియాస్ (అనసూయ) తదితరులపై కుట్ర కేసు నమోదుచేసి చట్టప్రకారం విచారణ జరిపించాలని కోరుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Revanth Reddy, Telangana