హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టోల్ రుసుం వసూళ్లు.. సౌకర్యాల కల్పన శూన్యం

Telangana: టోల్ రుసుం వసూళ్లు.. సౌకర్యాల కల్పన శూన్యం

X
ములుగు

ములుగు పర్యాటకులపై టోల్ భారం

తెలంగాణ (Telangana) లోని చాలా మందికి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే మొదటగా గుర్తుకొచ్చే ప్రాంతం ములుగు జిల్లా (Mulugu). ఎందుకంటే ములుగు జిల్లాలో అనేక ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలు నెలవై ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Venu, News18, Mulugu

తెలంగాణ (Telangana) లోని చాలా మందికి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే మొదటగా గుర్తుకొచ్చే ప్రాంతం ములుగు జిల్లా (Mulugu). ఎందుకంటే ములుగు జిల్లాలో అనేక ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలు నెలవై ఉంటాయి. గతంలో ఈ ప్రాంతానికి అనేకమంది పర్యాటకులు వచ్చి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడిపేవారు. కానీ సరైన సౌకర్యాలు పర్యాటకులకు అందుబాటులో ఉండేవి కాదు. కాలం గడుస్తున్న కొద్దీ ములుగు జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ పర్యాటక రంగానికి ములుగు జిల్లా ప్రాంతం కేంద్ర బిందువుగా ఉంటుంది.

ములుగు ప్రాంతంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం.. కాకతీయుల గొలుసుకట్టు చెరువులు, లక్నవరం సరస్సు, తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం మహా జాతర, ఎత్తైన కొండల నుంచి జాలువారే బొగత జలపాతం, మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఇలా అనేక పర్యాటక ప్రాంతాలు ములుగు ప్రాంతంలో ఉన్నాయి.

ఇది చదవండి: పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే దిక్సూచీ

వీకెండ్ హాలిడేస్ వచ్చాయంటే అనేకమంది సుదూర ప్రాంతాల నుంచి ములుగు ప్రాంతానికి రావడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ పర్యాటకులకు అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. పది సంవత్సరాల క్రితం ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వద్ద ఎలాంటి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. ఉదాహరణకు మేడారం చేరుకునే భక్తులు మూడు చోట్ల టోల్ రుసుము రూపంలో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

ఇది చదవండి: భద్రాద్రి ఆలయంలో ఘనంగా ధ్వజారోహణం.., రామయ్య పెళ్లి సందడి షురూ..!

మొదటగా జవహర్ నగర్ సమీపంలోని నేషనల్ హైవే టోల్ ప్లాజా అనంతరం వస్త్ర గ్రామం దాటిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకోగానే మేడారం గ్రామపంచాయతీ సిబ్బంది మళ్లీ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 ప్రతినిధి సంబంధిత అధికారులను సంప్రదించగా.. ఫారెస్ట్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఫారెస్ట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి ఏటూర్ నాగారం వైల్డ్ లైఫ్ సెంచరీ ఫారెస్ట్ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన జీవో ద్వారానే రుసుము తీసుకుంటున్నామని వారు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బందిని విచారించగా గ్రామ సభ తీర్మానం ద్వారా వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నామని చెప్తున్నారు.

అభివృద్ధి పేరిట, పారిశుద్ధ్యం పేరిట వాహనదారుల నుంచి రుసుము వసూలు చేసినప్పటికీ వాహనదారులకు కనీస సౌకర్యాలను కల్పించడంలో మాత్రం ఫారెస్ట్ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే పరిస్థితి ములుగు జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాల వద్ద కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ములుగు ప్రాంతంలో ఫారెస్ట్ టోల్ రుసుము వసూలు చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఇక్కడ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వస్తే, వాహనదారుల నుంచి ఇలా రుసుము వసూలు చేయడం సరికాదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు