(M. Venu , News 18, Mulugu)
ములుగు జిల్లాలో ముగ్గురు మావోయిస్టు మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ముగ్గురు మిలిషియా సభ్యులు అనుమానాస్పదంగా పోలీసులకు చిక్కారు. మొదట పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంకటాపురం పోలీసులు ఆముగ్గురిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీలకు సంబంధించి జెఎండబ్ల్యూసి డివిజన్ కమిటీ నినాదాలతో కూడిన కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు మావోయిస్టు మిలిషియా సభ్యులు తాటి సోమయ్య, తాటి సత్యం, యాలం సురేష్ లు కొండాపురం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు 2018 నుంచి మావోయిస్టు సానుభూతిపరులుగా పనిచేస్తూ మావోయిస్టులకు సంబంధించిన నిత్యావసర సరుకులు, భోజనాలు అందిస్తూ ఉంటారని తెలిసింది. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉండటంతో దానికి సంబంధించిన కరపత్రాలను కొండాపురం బ్రిడ్జి వద్ద వేసేందుకు వస్తున్న సమయంలోనే వెంకటాపురం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మానసిక ఒత్తిడితో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు గ్రామానికి చెందిన కన్నబోయిన రవి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. రవి తండ్రి కన్నెబోయిన రాజయ్య ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి రవి ఎవరితో మాట్లాడకుండా మానసిక వేదనకు గురయ్యేవాడు. కుటుంబ సభ్యులు రవిని పలుమార్లు మానసిక వైద్యులకు చూపించినా అతనిలో మార్పు కనపడలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే రవిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న రవి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గుజరాత్ నుంచి వచ్చిన కొందరు యువతులు రహదారిపై హల్ చల్ చేశారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ సమీపంలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై వచ్చిపోయే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి యువతులు బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. ఒక వాహనదారుడు విషయాన్నీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని డబ్బులు వసూలు చేస్తున్న ఏడుగురు యువతలను అదుపులోకి తీసుకున్నారు. యువతుల వద్దనున్న గుర్తింపు కార్డులను పరిశీలించగా వారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన యువతులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి చర్యలు మళ్లీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతుల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుని విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Mulugu, Warangal