రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లోకేషన్ : చిరుతపల్లి, వెంకటాపురం
వారందరూ గిరిజన విద్యార్థులు. విద్యను అభ్యసించడం కోసం తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహాలలోనే ఉంటూ చదువుకుంటున్న నిరుపేద గిరిజన విద్యార్థినిలు. ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం వెంకటాపురం మండల కేంద్రం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల అది. చిరుతపల్లి పాఠశాల విద్య , క్రీడారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది.
చుట్టుపక్కల ఉండే గ్రామాలకు చెందిన గిరిజన బాలికలు ఇక్కడ విద్య అభ్యసిస్తూ ఉంటారు. మెరుగైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. వారి బోధనకు తగ్గట్టుగానే ఇక్కడ విద్యార్థులు ఉత్తీర్ణత శాతంలో రికార్డులు సైతం సృష్టిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థుల బాధ వర్ణనాతీతంగా మారింది.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది. టాయిలెట్స్ కి వెళ్తే బాత్రూం దగ్గర, గదులలో బట్టలు మార్చుకుంటున్నప్పుడు విద్యార్థినుల వీడియోలు తీసి నేను చెప్పిన పని చేయాలంటూ విద్యార్థులను వేధిస్తోందని అక్కడ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయురాలిని బదిలీ చేయాలని నినాదాలు తీస్తూ విద్యార్థులు ఏకంగా రోడ్డుపై బైఠాయించారు.
గత రెండు మూడు నెలల నుంచి విద్యార్థులు అనేక విధాలుగా వేధింపులకు గురి అవుతున్నారు. సరైన విద్యా బోధన లేక విద్యార్థులు చదువులో సైతం వెనుకబడి పోతున్నారు. ఉపాధ్యాయురాలు విద్యార్థినులను వేధించడమే కాకుండా వారు తల్లిదండ్రులకు సైతం తప్పుడు నివేదికలు పంపుతున్నారట.
విద్యార్థులపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయురాలు..
చిరుతపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వివాదాల విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వసతి గృహంలో నిద్రిస్తున్న తనపై విద్యార్థులు దాడి చేసి, భయభ్రాంతులకు గురి చేసినట్లు ఉపాధ్యాయురాలు పోలీస్ స్టేషన్లో విద్యార్థులపై ఫిర్యాదు చేసింది. ఒకవైపు విద్యార్థులు ఉపాధ్యాయురాలు తమని అనేక విధాలుగా వేధిస్తుందని ఆరోపిస్తుంటే.. ఏకంగా ఉపాధ్యాయురాలు కూడా ఎక్కడ తగ్గకుండా విద్యార్థులే తమపై హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ములుగు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది.
దీనిపై స్పందించిన ఐటీడీఏ అధికారులు విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆమెని ఐటిడిఏ కార్యాలయానికి సరెండర్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం మన ఊరు మనబడి ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని తాపత్రయపడుతుంటే ఇలాంటి ఘటన ద్వారా ఉన్నత లక్ష్యాలు మసకబారిపోతున్నాయి. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య అవగాహన లోపమా లేక విద్యార్థులకు ఉపాధ్యాయులకు కమ్యూనికేషన్ లోపమా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సరైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులే వివాదాలకు కారణమవుతుంటే వాటి నుంచి విద్యార్థులు ఏం నేర్చుకుంటారనే చర్చ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana