Venu, News18, Mulugu.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడవ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఏటూరునాగారంలోని కొమరం భీమ్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టియనా జెడ్. చోంగ్దు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఆమెకు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు గౌరవ వందన సమర్పిస్తూ ఘన స్వాగతం పలికారు.
ఈ క్రీడా పోటీలలో ఏటూరు నాగారం, భద్రాచలం , ఉట్నూరు ఐటిడిఏలతోపాటు మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన క్రీడాకారులు మొత్తం 1571 మంది పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగబోయే సొసైటీ క్రీడలలో ఆడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
ఈసందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టియనా జెడ్. చోంగ్దు మాట్లాడుతూ క్రీడలతో శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ ఏర్పడుతుందని, క్రీడాకారులు అంకితభావంతో ఇటు చదువులోనూ ఆటల్లోనూ ముందుకెళ్లాలని సూచించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పిఓ అంకిత్, ఉట్నూర్ ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి డాక్టర్ క్రిస్టియనా జెడ్. చోంగ్దు క్రీడా ప్రాంగణంలో వేదిక వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.
క్రీడ మైదానంలో శాంతి కపోతలను ఎగరవేశారు. క్రీడాకారులు క్రమశిక్షణ అలవర్చుకోని జీవితంలో ఎంతో కీర్తి సంపాదించాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె పేర్కొన్నారు. క్రీడలు క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని క్రీడలు పునాది వంటివని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసిన ములుగు జిల్లా అధికారులను ఆమె ప్రశంసించారు.
హోరహోరిగా కొనసాగుతున్న క్రీడలు: ఎటూరు నాగారంలో జరిగే మూడవ రాష్ట్ర స్థాయి క్రీడల్లో మొత్తం 1500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి రోజుల్లో భాగంగా అధికారుల చేత గౌరవ వందనం, క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలను ప్రారంభించారు. ఈ పోటీలలో క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు. క్రీడల ప్రారంభంతో ఒక్కసారిగా ఎటూరు నాగారం ప్రాంతం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది.
గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద క్రీడా సంబరం జరగడం ఇదే మొదటిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఫలితాల్లో అథ్లెటిక్స్ విభాగంలో బాలురలో J. ప్రవీణ్, ఉట్నూర్, K.పరశురామ్, ఉట్నూర్, M. చరణ్ ఏటూరు నాగారం 600 మీటర్లలో మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. బాలికల విభాగం పరుగు పందెంలో M. జాష్ణవి, భద్రాచలం, ఎస్ఎస్ శ్రీలత, ఆసిఫాబాద్, ఎస్. అనిత, ఉట్నూరు అండర్ 14లో మొదటి మూడు స్థానాలు గెలుపొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.