రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లొకేషన్ : ములుగు
వారందరూ వ్యవసాయ కూలీలు.. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని బతుకులు. వారికి తెలిసిందల్లా ఒక్కటే సూర్యుడుతో పరిగెత్తడం. సూర్యుడు ఉదయించడం కంటే గంటకు ముందే నిద్రలేచి ఉడుకుడుకు బువ్వ బాక్సులో పెట్టుకొని కూలికి వెళ్లడం వారి దినచర్య. కానీ ఎవరికి తెలుసు ఏ రోజు ఎలా ఉంటుందో.. ఏ రోజు ఎలా ముగిసిపోతుందో. రోజువారి లాగే వారు సద్ది మూటలు కట్టుకొని కూలి పనులకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. తీసుకుపోవడం కోసం మూడు చక్రాల ఆటో రానే వచ్చింది. కానీ ఎవరు ఊహించలే.. ఆ ఆటో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంటుందని. మార్గ మధ్యలోనే ఆటో ప్రమాదానికి గురై ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోగా.. మరో మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతుంటే మార్గమధ్యలో ప్రాణాలను విడిచింది.
మిగిలిన 16 మందికి గాయాలయ్యాయి.. అందులో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఇది మూడు రోజుల క్రితం జరిగిన ఘటనే.. కానీ ఇక్కడ విషయం ప్రమాదానికి కారణం ఏమిటి? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి? ఆటోలో పరిమితికి మించిన కూలీలను ఎక్కించుకోవడం ఆటో యజమాని మొదటి తప్పు కాగా.. ఆటో కిరాయి డబ్బులు వస్తున్నాయని లాభాపేక్ష మాత్రమే చూసి నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఆ యజమాని. ఒకే ఆటోలో 18 మంది ఎక్కడం కూలీలు చేసిన తప్పు. తక్కువ డబ్బులు అవుతాయనే ఉద్దేశంతో ఒకే ఆటోలో అంత మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణం.
నిజానికి వ్యవసాయ ఆధారిత గ్రామాలలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. నలుగురికి పరిమితమయ్యే ఆటోలో 18 మందిని ఎక్కించడం.. ట్రాక్టర్లలో యాభై మందిని తరలించడం ఇక్కడ తరచుగా జరుగుతూనే ఉంటుంది. పరిమితికి మించి కూలీలను వాహనాలలో ఎక్కిస్తున్నా అధికారులు చూసి చూడకుండా వ్యవహరించడం మూడో తప్పు. ఇలా ఒకరి మీద ఒకరు తప్పులు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
మేడారం ప్రాంతంలో ఓ రైతు నాటు వేసేటందుకు గోవిందరావుపేట మండలం ముద్రగూడెం గ్రామంలోని 18 మంది వ్యవసాయ కూలీలను మాట్లాడుకున్నాడు. ఆ పొలం యజమాని వారిని తీసుకువెళ్లడం కోసం ఒక ఆటోను పంపించాడు. కానీ ఆ డ్రైవర్ అతివేగం ఇద్దరు ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా 16 మందికి గాయాలయ్యేలా చేసింది. ములుగు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. కానీ అధికారులు అప్పటి వరకు మాత్రమే చర్యలు తీసుకుంటారు. నాలుగు రోజులు తనిఖీలు చేపట్టి మర్చిపోతారు. మళ్లీ యధావిధిగా అదే కొనసాగుతుంది. ఇప్పటికైనా వాహనదారులు లాభంతో పాటు భద్రత అనేది ప్రామాణికంగా తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయన్నది ఆలోచించాల్సిన విషయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana