(Venu Medipelly, News18, Mulugu)
ములుగు (Mulugu) జిల్లా వ్యాప్తంగా వరదలు పోటెతుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy rains) జిల్లా పరిధిలోని వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు ఎగువన గోదావరి నది (Godavari River)పై దూసుకొస్తున్న వరద కారణంగా నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. జిల్లాలో వరదల పరిస్థితిపై కలెక్టర్ (Collector) ఎస్. క్రిష్ణ ఆదిత్య (Krishna Aditya) సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు.
వరదలపై జిల్లా కలెక్టర్ సమీక్ష..
ములుగు (Mulugu) జిల్లాలో వరదల (Floods) పరిస్థితిపై ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వెంకటాపురం మండలంలో అత్యధికంగా 22.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ నుండి ఇంచుమించు 11 లక్షల క్యూసెక్కుల నీరు, మహారాష్ట్ర నుండి 4 లక్షలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు మొత్తం 7 లక్షల క్యూసెక్కుల నీరు రావడం వల్ల గోదావరి నది నీటి మట్టం 16.6 సెంటీమీటర్లు పెరిగిందని ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
పునరావాస కేంద్రాలకు తరలింపు..
గోదావరి (Godavari) పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు గ్రామాల ప్రజలను అధికార యంత్రం అప్రమత్తం చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ములుగు జిల్లాలో అన్ని శాఖల అధికారులు 25 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారని ఇప్పటి వరకు నాలుగు వేల మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, నీరు, ఆహారం అందించినట్లు కలెక్టర్ వివరించారు. ఐటీడీఏ పరిధిలో రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ అధికారి అంకిత్ పేర్కొన్నారు. గోదావరి నది నీటిమట్టం పెరగడం వల్ల లోతట్టు మండలాలైన తాడ్వాయి, గోవిందరావుపేట, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, కన్నాయిగూడెం ముంపుకు గురయ్యాయి. ముంపు గ్రామాల నుండి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ భవనాలు, ఐటిడిఏ ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
వరదల సమయంలో ముందు జాగ్రత్త చర్యగా సహాయక బృందాలను, విపత్తు నిర్వహణ సిబ్బందిని రంగంలోకి దించారు అధికారులు. రెస్క్యూ బృందంతో వెంకటాపురం వద్ద ఒక స్పీడ్ బోటు, వాజేడు మండలానికి రెండు స్పీడ్ బోట్లు, ఏటూరునాగారంలో ఒక స్పీడ్ బోటు, పిఓ ఐటిడిఏ నుండి ఒక స్పీడ్ బోటు సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం 200 మంది పోలీసులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ అన్నారు. వారికి ఐటిడిఏ కార్యాలయంలో అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు.
వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులు, పునరావాస కేంద్రాలపై సమాచారం కోసం ప్రజలు 18004250520 హెల్ప్ లైన్ నెంబర్ సంప్రదించాలని అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Godavari river, Heavy Rains, Local News, Mulugu