Fake Seeds Selling: జోరుగా నకిలీ విత్తనాల విక్రయాలు.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. రూ.లక్షల్లో విలువ చేసే..

నకిలీ విత్తనాలను చూపుతున్న పోలీసులు

Fake Seeds Selling: పనికిరాని, నాసిరకం విత్తనాలను అమ్ముతున్న వారిని ములుగు పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి మొక్కజొన్న, పచ్చ, తెల్ల జొన్న కల్తీ చేసిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.

 • Share this:
  (కె.వీరన్న, మెదక్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ గ్రామం లోని రాయల్ ట్రేడింగ్ కంపెనీ గోదాం, మరియు GQSD ఎంటర్ప్రైజెస్ గోదాములలో తనిఖీలు నిర్వహించగా మొక్కజొన్న విత్తనాలు, పచ్చ, తెల్ల జొన్న కల్తీ చేసిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 184 క్వింటాళ్ల నకిలి విత్తనాలను పట్టుకున్నారు. వాటి విలువ రూ. 34 లక్షల 49వేలుగా ఉంటుందని ములుగు పోలీసులు తెలిపారు. పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు గజ్వేల్ రూరల్ సిఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్సై రంగకృష్ణ, ఏఓ ప్రగతి మరియు పోలీసు సిబ్బందితో కలసి సాధారణ తనిఖీలలో భాగంగా నర్సాపూర్ గ్రామం లోని రాయల్ ట్రేడింగ్ కంపెనీ గోదాం, మరియు GQSD ఎంటర్ప్రైజెస్ గోదాములలో తనిఖీలు నిర్వహించగా మొక్కజొన్న విత్తనాలు , పచ్చ, తెల్ల జొన్న కల్తీ చేసిన విత్తనాలను స్వాధీనం చేసుకుని గోదాం నిర్వాహకులు కమల్ కుమార్, జలంధర్ కుమార్ రజ్వాని, అర్జున్ లాల్ రజ్వాని,లపై ములుగు ఎస్సై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారించగా సీడ్స్ కంపెనీలలో విత్తనాలు తయారు చేసేటప్పుడు రిజెక్టెడ్ విత్తనాలు కొనుగోలు చేసి వాటికి కలర్, ఇతర విత్తనాలు కలిపి తయారుచేసి బ్యాగుల నింపి రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్లు ప్రథమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నకిలీ విత్తనాలపై పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రంగకృష్ణ విత్తనాలు ఎక్కడ నుండి తీసుకు వచ్చారు ఎలా తయారు చేశారు, ఎక్కడ అమ్ముతున్నారు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అనే విషయాలపై పూర్తి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

  కమిషనర్ ఆదేశానుసారం దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీస్ అధికారులు. ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సిఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు విత్తనాల కొనుగోలుల విషయంతో జాగ్రత్తగా ఆలోచించి నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనాలని సూచించారు. నమ్మకమైన ఫర్టిలైజర్ షాప్ యజమానుల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని.. వారి వివరాలను తమకు అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తరచుగా షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూసే షాపు యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సహాయ సహకారాలతో విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

  గ్రామాలలో తిరుగుతూ అమ్మే విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే షాపు యజమానులపై మరియు వ్యక్తుల పై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు మరియు ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
  Published by:Veera Babu
  First published: