Venu, News18, Muluguఒకప్పుడు అజ్ఞాతంలో ఉన్న ఆ దంపతులు... ప్రజల కోసం దళంలో ఉండి పోరాటం చేశారు. రెండు దశాబ్దాల క్రితం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులుగా హిట్ లిస్టులో ఉండేవారు. అడవుల్లో జరిగిన అనేక దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అతను. అగ్ర నాయకులకు గార్డుగా వ్యవహరించాడు. కొత్తగా అజ్ఞాతంలో వచ్చిన వారికి మిలటరీ ట్రైనింగ్ ఇవ్వడంలో అతను దిట్ట. ఇతని ఆధ్వర్యంలో ఎందరో దళంలో చేరిన ఆరితేరేవారు. ఆమె విప్లవ పాటలతో అనేక మందిని దళంలోకి ఆకర్షించింది. వీరిద్దరూ ఒక్కటయ్యారు. రోజులు గడిచిన కొద్ది వారి ఆలోచనలు మారాయి. ఈ పోరాటాల ద్వారా సాధించేది ఏమి లేదని గ్రహించారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల మధ్య ఉంటూ బడుగు బలహీన గిరిజనుల కోసం అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కొప్పుల బక్కయ్య అలియాస్ నవీన్ కొప్పుల సరిత వీరి జీవితం పై న్యూస్ 18 ప్రత్యేక కథనం.
తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన కొప్పుల బక్కయ్య విప్లవాలకు ఆకర్షితుడై బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేయాలనీ దళంలో చేరాడు. కాలువపల్లి గ్రామం నుంచి అనేక మంది వ్యక్తులు అజ్ఞాతంలో పెద్ద క్యాడర్‌గా వ్యవహరించిన వారు ఉన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని బక్కయ్య బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం మొదలు పెట్టాడు. బక్కయ్య అలియాస్ నవీన్... దళంలో ఒక సాధారణ మావోయిస్టు నుంచి జిల్లా కేడర్లో విధులు నిర్వహించి అగ్ర నాయకులకు సైతం గార్డుగా వ్యవహరించాడు. నిరుపేద రైతుల కోసం గిట్టుబాటు ధర చెల్లించడం, పోడు భూములపై హక్కులు సాధించడం కోసం చేసిన పోరాటంలో బక్కయ్య అలియాస్ నవీన్ తనదైన ముద్రను వేసుకున్నాడు. దాదాపు ఐదు లైవ్ ఎన్‌కౌంటర్ల నుంచి బక్కయ్య అలియాస్ నవీన్ తృటిలో తప్పించుకున్నాడు.
జనజీవన స్రవంతిలో కలిసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దంపతులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇద్దరిని చూస్తే భయంతో ఎవరు మాట్లాడేవారు కాదు. బయటికి వచ్చిన అనంతరం ఏం చేయాలో తెలియక చాలా రోజులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. లొంగిపోతే ఇస్తామన్న మూడు ఎకరాల భూమి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎలాంటి జీవనాధారం లేక రోజువారి కూలీ పనులకు వెళ్తున్నారు. కొప్పుల సరిత ములుగు జిల్లా తుడుం దెబ్బ మహిళా అధ్యక్షురాలిగా గిరిజనులకు సేవలు చేస్తు ఆదర్శంగా నిలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Maoist, Mulugu, Telangana