Venu, News18, Mulugu
తెలంగాణ (Telangana) లో టెన్త్ ఎగ్సామ్స్ (TS SSC Exams) కి రంగం సిద్ధమవుతోంది. ఓ వైపు స్టూడెంట్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే.. మరోవైపు అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ములుగు జిల్లా (Mulugu District) లో పదవ తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ములుగు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల కోసం 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటిలో3170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవ్వనున్నారు. అదనపు కలెక్టర్ రెవిన్యూవైవి గణేష్ 10వ తరగతి పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతోకోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటుచేసి అధికారులకు సూచనలు చేశారు.
10వ తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన పనులనుసమీక్షిస్తూ, వచ్చే ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను అధికారులు పరస్పర సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ములుగు జిల్లాలో మొత్తం 115 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 21 పరీక్షా కేంద్రాల ద్వారా 3170 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసేలా చూడాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షకు ముందు,తరువాత పారిశుద్య చర్యలను చేపట్టాలని, టాయిలెట్స్ సరిగా వుండేలా చర్యలు తీసుకోవాలని,అలాగే నీటి పారుదల శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో నీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ ప్రశ్నా పత్రాల స్టోరేజీ, తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పరీక్ష అనంతరం జవాబు పత్రాల తరలింపు ప్రక్రియను పోస్టల్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షలు ప్రారంభమై ముగిసేంత వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వైర్లెస్ సెట్ తో ఒక అధికారి ఎళ్లవేళలా అందుబాటులో ఉండనున్నారు. మొత్తం ములుగు జిల్లాలో ప్రశ్న పత్రాల పంపిణీ కోసం రెండు రూట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూట్లపై రెవెన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. విద్యార్థులకు పరీక్షా సమయంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడితే పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, హెల్త్ కిట్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్దకు రావడానికి సంబంధిత రూట్ మ్యాపులను రవాణా శాఖ సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో కరెంట్ అంతరాయం ఉండకూడదని సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులకు ములుగు జిల్లా కలెక్టర్ సూచించారు. పరీక్షలకు సమయం ఆసన్నమవుతుండడంతో విద్యార్థులకు అందరూ సహకరించాలని అధికారులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana, Telangana SSC board exams