హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ములుగులో దృష్టి మరల్చి దారి దోపిడీ.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?

Mulugu: ములుగులో దృష్టి మరల్చి దారి దోపిడీ.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?

నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సోదరికి కూడా కొంత అప్పు చెల్లించాల్సి ఉండటంతో రూ. 1.99 లక్షల నగదుతో వర్ధన్నపేటకు బయలుదేరాడు ఐలయ్య. రాత్రంతా అక్కడే నిద్రించిన ఐలయ్యకు తెల్లవారుజామున లేచి చూడగా తన డబ్బూ, సెల్ ఫోన్ మాయం అయ్యాయి.

(Venu Medipelly, News18, Mulugu)

జనగామ (Janagama) జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన లంక ఐలయ్య తన కూతురు వివాహా నిమిత్తం తెలిసిన బంధువుల దగ్గర అప్పు చేశాడు. ఇటీవల తన భూమిని అమ్మిన ఐలయ్య.. వచ్చిన డబ్బులతో బంధువుల వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు జులై 19న వరంగల్ రామన్నపేటలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ కొంత అప్పు చెల్లించి, వర్ధన్నపేటలోని తన సోదరికి కూడా కొంత అప్పు చెల్లించాల్సి ఉండటంతో రూ. 1.99 లక్షల నగదుతో వర్ధన్నపేటకు బయలుదేరాడు. వరంగల్ (Warangal) బస్టాండ్‌లో ఐలయ్య ఆటో ఎక్కుతుండగా అతడి జేబులో ఉన్న నగదు కట్టలను అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు గమనించారు. ఐలయ్య ఎక్కిన ఆటోలోనే ఇద్దరు మహిళలు ఎక్కారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ నలుగురు కలిసి ఐలయ్యతో మాటలు కలిపి మద్యం తాగించారు. ఐలయ్య మద్యం మత్తులో జారుకునే స్థితిలో నలుగురు వ్యక్తులు తెలంగాణ జంక్షన్ వద్ద ఇసుక అడ్డా వద్దకు తీసుకెళ్లారు.

అనంతరం ఐలయ్య జేబులో ఉన్న రూ. 1.99 లక్షల నగదు, సెల్‌ఫోన్ అపహరించి వెళ్లిపోయారు. మద్యం మత్తులో రాత్రంతా అక్కడే నిద్రించిన ఐలయ్యకు తెల్లవారుజామున మేలుకువతోనే తన డబ్బూ, సెల్ ఫోన్ మాయం అయినట్లు గుర్తించి స్థానిక మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన మీల్స్ కాలనీ పోలీసులు సీసీ కెమెరాలు ఫుటేజీ పరిశీలించి, ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారావు పేట మండలం లింగాపూర్ గ్రామం చెందిన ఎడ్ల కుమార్, దుగ్గొండి మండలం బికాజి పల్లి గ్రామానికి చెందిన దుంక దువ్వ, గీసుకొండ మండలం పోతురాజు పల్లి గ్రామానికి చెందిన ఒకరు, మహబూబాద్ జిల్లా పెరుమాల సురేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 1.15 లక్షల నగదును, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ తాళం చెవితో ఇంటిలోకి..

అద్దెకుంటున్న యజమాని ఇంట్లోనే చోరీ చేసిన వ్యక్తిని ఇంతేజార్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశిబుగ్గకు చెందిన గుండేటి రజిని ప్రైవేటు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తమ ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక గదిని గిర్మాజీపేటకు చెందిన ఎలగంటి గణేష్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈక్రమంలో యజమాని కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గణేష్ తన వద్ద ఉన్న నకిలీ తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.35 వేలు నగదు చోరీ చేశాడు. ఇది గుర్తించిన ఇంటి యజమాని రజిని...పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్మయి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో ప్రత్యేక పోలీసు బృందం గణేష్‌ను అదుపులోకి తీసుకొని ఐదు తులాల బంగారం, రూ. పది వేలు నగదును రికవరీ చేశారు.

ఏజెన్సీలో హై అలర్ట్..

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతుంది. మావోయిస్టు వారోత్సవాలను జరుపుకోవాలని కరపత్రాలు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరిగింది. జులై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీని జల్లెడ పడుతూ అడుగడుగునా తనిఖీలను నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో దట్టమైన అడవులు, గోదావరి రేవులపై, గోదావరి పరివాహక ప్రాంతంలో పటిష్ట నిఘా ఉంచారు. స్పెషల్ పార్టీ పోలీసులు అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు.

First published:

Tags: Crime news, Local News, Mulugu, Warangal

ఉత్తమ కథలు