Venu, News18, Mulugu
సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ (Smart Phones) యుగంలో ఒక్క మెసేజ్ తో బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అడ్డుఅదుపూ లేని సైబర్ నేరగాళ్ల మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. సైబర్ నేరాలపై, సాంకేతికత విషయాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడిపుడే సైబర్ నేరాల నుంచి తప్పించుకోగలుగుతుండగా... పల్లెలు, మారుమూల గ్రామాల్లో ప్రజలు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఈక్రమంలో ఏజెన్సీ జిల్లాలో సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రజలను చైతన్య పరచడంలో ములుగు పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పోలీస్ కళా బృందంతో సైబర్ నేరాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సైబర్ బుల్లింగ్ మరియు ఆన్ లైన్ ఫ్రాడ్స్, సమాజంలో ఆడవారిపై జరిగే లైంగిక వేధింపులు చిన్నతనంలో పెళ్లి చేస్తే జరిగే నష్టాల గురించి వివరిస్తూనే ఫేస్ బుక్ (Facebook), ఇన్ స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (Whats App) లోని వ్యక్తిగత గోప్యత మరియు భద్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, పాస్ వర్డ్ లు అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని, సోషల్ మీడియా (Social Media) లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేయవద్దని, అనుమానిత లింకులపై క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల నుండి సందేశాలు వచ్చినప్పుడు వాటిని అంగీకరించవద్దని వివరించారు. ఇవే కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే యువత ఆన్లైన్ మోసాల బారిన పడకూడదని గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఓటీపీలు, లింక్స్, మెసేజ్ వస్తే స్పందించకూడదని అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
సైబర్ నేరాలపై ఫోన్ ఇన్ కార్యక్రమం
జిల్లాలో సైబర్ నేరాల గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా సందేహాలు ఉన్నా నివృత్తి చేసేలా ములుగు జిల్లా ఎస్పీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. సైబర్ నేరాలపై ప్రజల సందేహాలు తీరుస్తూ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టారు. 7901628404 నెంబర్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ చేసిన ప్రజలతో పోలీసులు మాట్లాడి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber crimes, Local News, Mulugu, Telangana