(Venu Medipelly,News18,mulugu)
భారతదేశానికి రైతు వెన్నెముక అని మనం చెప్పుకుంటాం. 70 శాతానికి పైగా దేశం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో కోట్లాది మంది రైతులు వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. అదే వ్యవసాయ రంగం(Agriculture sector)పై ఆధారపడి కొన్ని లక్షల వ్యవసాయ కూలీల కుటుంబాలు పొట్ట నింపుకుంటున్నాయి. అయితే వ్యవసాయం, రైతులు పేరుతో బహిరంగ దోపిడీ కూడా జరగడం విచారించాల్సిన విషయం. వ్యవసాయ పనులు మొదలుపెట్టే కాలం వచ్చిందంటే చాలు కొందరు కేటుగాళ్లు రైతులను మోసం చేయాలని చూస్తుంటారు. నకిలీ విత్తనాల(Fake seeds)ను రైతులకు అంటగట్టి సొమ్ములు వెనకేసుకోవడానికి చూస్తుంటారు. ఇవేమి తెలియని అమాయక రైతన్న.. దళారులు చెప్పిన విత్తనాలను కొనుగోలు చేసి నిండా మునిగిపోతున్నాడు.
తొలకరి వర్షాలకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు రైతులు. విత్తనాలు సిద్ధం చేసుకుని పంటలు వేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.
ధర తక్కువంటూ ఆశ చూపి:
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అధికశాతం గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. నిరుపేద రైతులపై కూడా నకిలీ విత్తనాల ప్రభావం ఉంటుంది. రైతుకు తక్కువ ధర ఆశ చూపి నకిలీ విత్తనాలను అమ్మే ప్రయత్నం చేస్తారు దళారులు. వ్యవసాయ శాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ రైతు తక్కువ ధరకే వస్తున్నాయి అనే భ్రమలోపడి నకిలీ విత్తనాలను కొనుగోలు చేస్తుంటాడు. స్థానికంగా ఉండే కొన్నిఫర్టిలైజర్ షాప్ యజమానులకు కూడా తెలియకుండానే దళారులు నకిలీ విత్తనాలను అంటగడుతుంటారు.
నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి?:
నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి అనే అంశం పై రైతుల కోసం న్యూస్18 వ్యవసాయ అధికారిని సంప్రదించింది. వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి చెప్పిన సూచనలు... రైతులు గుర్తు తెలియని వ్యక్తులు తమ గ్రామాలలోకి వచ్చి విత్తనాలు అమ్మే ప్రయత్నం చేస్తే దగ్గర్లో ఉన్న వ్యవసాయ అధికారికి గాని పోలీసులకు కానీ సమాచారం అందించాలి. లైసెన్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ కేంద్రాలలో మాత్రమే రైతులు క్రయవిక్రయాలు జరపాలి. విత్తనాల ప్యాకెట్, సీడ్ బ్యాగ్ పై కంపెనీ యొక్క పూర్తి వివరాలతో పాటు బార్ కోడ్, లైసెన్స్ నెంబర్, కంపెనీ అడ్రస్ తదితర అంశాలు తప్పకుండా చూసుకోవాలి. వాటి గురించి అవగాహన లేకపోతే కొనుగోలు కేంద్రం యజమానినైనా దగ్గర్లో ఉన్న అధికారులనైనా సంప్రదించాలి.
అనుమానం ఉంటే అధికారులను సంప్రదించాలి:
నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని రైతులకు అనుమానం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులు. దుకాణదారులు చెబుతున్నారు. తక్కువ ధరకే విత్తనాలు వస్తున్నాయన్న ఆశతో రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దళారులు కూడా \" తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి\" అంటూ మాయమాటలు చెప్పి రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మాయమాటలకు గిరిజన నిరుపేద రైతులు మోసపోతుంటారు. నకిలీ విత్తనాలు తయారు చేసే వ్యక్తులను అధికారులు వెంటనే శిక్షించాలని దుకాణదారులే కోరుతున్నారు. లైసెన్సు లేని కంపెనీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో తాము అమ్మబోమని స్పష్టం చేస్తున్నారు.
సంప్రదించాల్సిన అధికారి వివరాలు :
జితేందర్ రెడ్డి
గోవిందరావుపేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి.
ఆఫీస్ అడ్రస్ : ఎంపీడీవో ఆఫీస్ గోవిందరావుపేట్
ఫోన్ నెంబర్ 9849314693
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu