పోలీస్ స్టేషన్.. ఈ మాట వినగానే అందరికీ ఏదో తెలియని భయం మనసులో ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్లాలన్నా లేదా ఎవరైనా తనపై ఫిర్యాదు చేశారని సదరు పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం వచ్చినా సామాన్య ప్రజలకు ఒక భయం ఉంటుంది. ఇక మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం అంటే సామాన్య విషయం కాదని భావిస్తుంటారు. ఇప్పటికీ చాలా చోట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే మహిళలు భయపడుతూ ఉంటారు.
కానీ నేడు తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నినాదంతో సామాన్య ప్రజలలో ఉన్న భయాన్ని తొలగించడానికి అనేక వినూత్న ప్రయోగాలు చేపడుతుంది. వీటిలో భాగంగానే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ వినూత్న ఆలోచన చేశారు. ఆ ఆలోచనే మదర్ అండ్ చైల్డ్ రూం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఈ మదర్ అండ్ చైల్డ్ రూం ఏర్పాటు చేశారు.
మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్..
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ జిల్లాలో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ఏర్పాటు చేయాలని భావించి.. ఆ ఆలోచనను వెంటనే కార్యరూపం ఇచ్చారు. అనుకున్నట్టుగానే తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ప్రారంభించారు. ఏర్పాటు చేయడమే కాకుండా చిన్న పిల్లల కోసం ఆ ప్రత్యేక గదిలో ఆట బొమ్మలను, ఆట వస్తువులను సైతం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి, నిందితులను కలవడానికి, ఇతర పనులపై వచ్చే చిన్న పిల్లలు ఉన్న తల్లులు సేద తీరడం కోసంఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.
మహిళలకు ఈ ప్రత్యేక గది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న తల్లులు ఎక్కువ సమయం పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ గది ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్ కు వచ్చాం అనే అనుభూతి రాకుండా ఉండటం కోసం ఇలాంటి ప్రత్యేక సదుపాయాలతో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలా పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి అని, ఇలాంటి వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నందుకు పోలీస్ అధికారులను తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Police station, Telangana