Venu, News18, Mulugu
భూపాలపల్లి జిల్లా (Bhupalapalli) కాటారం మండల పరిధిలో పోలీసులు మాజీ మావోయిస్టును అరెస్ట్ చేశారు.. పాటరం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి చెప్తున్న వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన పొలం రాజయ్య మిషన్ భగీరథలో పనిచేస్తూ ఉంటాడు. రాజయ్య తన 13 సంవత్సరాల వయసులోనే పెద్దపెల్లి ఏరియా దళంలో చేరి పని చేశాడు. దుమ్మటి అర్జున్ అలియాస్ నాగన్న అతని భార్య నిర్మల కమాండర్ గా ఉన్న దళంలో పని చేశాడు. వెంకటేష్ తో రాజయ్యకు పరిచయం ఏర్పడింది. అనంతరం ఉమ్మడి వరంగల్ (Warangal District), కరీంనగర్ (Karimnagar District) జిల్లాలకు సంబంధించిన అగ్రనేత జగన్ వద్ద ప్లాన్ టు కమాండర్ గా రాజయ్య పని చేశాడు.
2002లో రాజయ్య జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. రాజయ్యకు ప్రభుత్వం వ్యవసాయ భూమి అందజేసింది. రాజయ్య వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కానీ వ్యవసాయం అతనికి కలిసి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఏమి చేయాలో అర్థం కాక రాజయ్య మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే గతంలో పరిచయమైన మావోయిస్టు ప్రతినిధి రాజిరెడ్డిని కొన్ని నెలల క్రితం ఫోన్లో సంప్రదించాడు.
మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులను కలుస్తూ నూతనంగా పార్టీలో చేరేలా రాజయ్య ప్రోత్సహిస్తున్నాడు. రాజిరెడ్డి సూచన మేరకు రాజయ్య పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం తీసుకొని సరిహద్దుకు వెళ్తున్నాడు. కాటారం మండల కేంద్రంలోని బొప్పారం క్రాస్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజయ్యను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారించి తనిఖీ చేయగా నాలుగు జిలేటెన్ స్టిక్స్ డిటోనేటర్లు, ఫోను, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రాజయ్యను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Maoist, Mulugu, Telangana