Home /News /telangana /

MULUGU MALLAMPALLI AREA MINING ABH BRV MMV

Mulugu: అనుమతులు తీసుకునేది ఎర్రమట్టి తవ్వకాలకు, కానీ జరిగేది వేరు... మల్లంపల్లి మైనింగ్ పై కధనం

ఎర్రమట్టి తవ్వకాల మాటున విలువైన ఖనిజ సంపద తరలింపు

ఎర్రమట్టి తవ్వకాల మాటున విలువైన ఖనిజ సంపద తరలింపు

అదే సమయంలో ఈ హత్యోదంతంతో మల్లంపల్లిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల గురించి బయట ప్రపంచానికితెలిసింది. ఎర్రమట్టి మైనింగ్ లావాదేవీల నేపథ్యంలోనే న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేశారనేది స్థానికంగా అందరూ చర్చించుకుంటున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M.Venu, News 18, Mulugu)

    ఆగస్టు ఒకటో తారీకు ప్రశాంతంగా ఉన్న ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పందికుంట క్రాస్ వద్ద సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి హత్యకు గురయ్యాడు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటన. అదే సమయంలో ఈ హత్యోదంతంతో మల్లంపల్లిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల గురించి బయట ప్రపంచానికితెలిసింది. ఎర్రమట్టి మైనింగ్ లావాదేవీల నేపథ్యంలోనే న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేశారనేది స్థానికంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో మల్లంపల్లిలో ఎర్రమట్టి భూములు...అనుమతి పొందిన కంపెనీలు ఎన్ని? మైనింగ్ జరుగుతున్న ఎకరాలు ఎన్ని? వంటి విషయాలపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

    భూమి నుంచి విలువైన ఖనిజాలను వెలికి తీసే ప్రక్రియను మైనింగ్ అంటారు. నిజానికి ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో అనేక సంవత్సరాలుగా మైనింగ్ వ్యాపారం జరుగుతుంది. మొదటగా సిమెంట్ తయారీకి ఉపయోగపడే లాటరైట్ కోసం తవ్వకాలు జరిగేవి. కానీ తర్వాత కాలంలో ఇనుప ఖనిజం, బాక్సైట్, డోలమైట్ వంటి ఖనిజాల కోసం కూడా తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మల్లంపల్లి గ్రామం చుట్టూ ఉన్న వందల ఎకరాలలో ఈ మైనింగ్ వ్యాపారం విస్తరించి ఉంది. ఇక్కడ జరిగే మైనింగ్ వ్యాపారానికి అనేకమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నవారేనని, ఎన్ని అక్రమాలు జరిగినా పరిమితికి మించి తవ్వకాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదని అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు.

    చిన్న వ్యాపారులుగా మొదలుపెట్టి అనేకమంది వ్యక్తులు కొన్ని రూ. కోట్లకు పడగలెత్తారు ఈ మైనింగ్ వ్యాపారం వల్ల. రాజకీయ నాయకులు కూడా ఈ మైనింగ్ వ్యాపారంలో పరోక్షంగా చేతులు కలిపారని అంటున్నారు. ఒక్కో మైనింగ్ వ్యాపారి ఆధ్వర్యంలో అనేక వందల ఎకరాలు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ఈనేపథ్యంలోనే మల్లంపల్లిలో ఉండే భూముల గురించి, భూ సరిహద్దు విషయాలలో, భూ కబ్జా విషయాల్లో పరస్పరం వ్యక్తులు గొడవ పడ్డా, తిరిగి సెటిల్మెంట్ చేసుకుంటారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

    అనుమతి ఎర్రమట్టికి. మరి తవ్వేది ..?: మల్లంపల్లి గ్రామ పరిధిలో జరిగే లాటరైట్ మైనింగ్ సిమెంట్ తయారీకి అవసరం. కాబట్టి ఇక్కడ ఉండే లాటారైట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించడం కోసం అనుమతి తీసుకుంటారు. కానీ తవ్వేది మాత్రం డోలమైట్, బాక్సైట్ అని.. వీటి వ్యాపారం రూ. కోట్లల్లో జరుగుటుందని స్థానికులు చెబుతున్న మాట. మల్లంపల్లి నుంచి నిత్యం అనేక వందల లారీలు ఈ ఖనిజాన్ని తరలిస్తుంటాయి. సిమెంట్ తయారీకి, ఇనుము తయారీకి మల్లంపల్లి ప్రాంతంలో దొరికే ఖనిజాలు చాలా అనువైనవిగా ఉంటాయి. మల్లంపల్లి ప్రాంతంలో 50కి పైగా మైనింగ్ కంపెనీలు ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయట. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే అనుమతులు ఎర్ర మట్టి పేరుతో తీసుకుని ఇతర విలువైన ఖనిజాలను ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే ఎర్రమట్టి తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి కోసం తక్కువ మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.. అదే ఇతర ఖనిజాలకు మాత్రం రాయాలిటీ రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దీంతో అందరూ ఎర్రమట్టి పేరుతో అనుమతులు తీసుకుంటారని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది గ్రామస్తులు చెబుతున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Mulugu, Telangana

    తదుపరి వార్తలు