Home /News /telangana /

MULUGU MAIN ACCUSED ARRESTED IN LAWYER MALLAREDDY MURDER CASE IN MULUGU DISTRICT MMV ABH BRV

Mulugu: న్యాయవాది మల్లారెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితులు అరెస్ట్: పూర్తి వివరాలు

హత్య చేసిన కిరాయి రౌడీల కోసం ప్రత్యేక పోలీస్ బృందాల గాలింపు

హత్య చేసిన కిరాయి రౌడీల కోసం ప్రత్యేక పోలీస్ బృందాల గాలింపు

ములుగు జిల్లాలో సంచలనం రేపిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో ములుగు జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. గత నాలుగు రోజులుగా ములుగు జిల్లా వ్యాప్తంగా న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసు గురించే చర్చించుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M.Venu, News 18, Mulugu)

    ములుగు జిల్లాలో సంచలనం రేపిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో ములుగు జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. గత నాలుగు రోజులుగా ములుగు జిల్లా వ్యాప్తంగా న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసు గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ములుగు జిల్లా పోలీసులు శుక్రవారం రాత్రి పూర్తి వివరాలను ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... ఆగస్టు 1వ తేదీన సాయంత్రం 6:45 నిమిషాలకు న్యాయవాది మల్లారెడ్డి తన డ్రైవర్ సారంగంతో కలిసి ములుగు నుండి హనుమకొండకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పందికుంట క్రాస్ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు న్యాయవాది మల్లారెడ్డి కారును ఢీకొట్టారు. కారులో నుంచి దిగిన దుండగులు మూలగుండ్ల మల్లారెడ్డి ( న్యాయవాది) పై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. మల్లారెడ్డి డ్రైవర్ జోగు సారంగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ములుగు పోలీసులు, విచారణ ప్రారంభించారు.

    సంచలంగా మారిన కేసు: ఈ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్.. ఈ కేసును సవాలుగా తీసుకొని స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. హత్యకు సంబంధించిన బాధ్యులైన వ్యక్తులను త్వరితగతిని గుర్తించారు. హత్యకు గురైన మూలగుండ్ల మల్లారెడ్డి (న్యాయవాది), నర్సంపేటకు చెందిన గోనెలా రవీందర్, మల్లంపల్లి గ్రామానికి చెందిన పిండి రవి, గుడిసెలకుంటకు చెందిన వాంఛ రామ్మోహన్ రెడ్డికి మైనింగ్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. వ్యాపార లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో మిగతా ముగ్గురు కలిసి మూలగుండ్ల మల్లారెడ్డిని హతమార్చాలని ప్రణాళిక రచించారు. గోనెల రవీందర్ అనుచరుడైన తడక రమేష్ ద్వారా కర్నూలుకు చెందిన కొంతమంది కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి, ఆగస్టు ఒకటో తారీకు పందికుంట క్రాస్ వద్ద న్యాయవాది మల్లారెడ్డిని కత్తులతో పొడిచి హత్య చేశారు.

    ప్రధాన నిందితులు: ఈ హత్యకు సంబంధించి నర్సంపేటకు చెందిన గోనెలా రవీందర్, మల్లంపల్లి గ్రామానికి చెందిన పిండి రవి యాదవ్, కొడిసాల కుంట గ్రామానికి వంచ రామ్మోహన్ రెడ్డి, నల్లబెల్లి మండలానికి చెందిన తడక రమేష్.. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి వాంగ్మూలం తీసుకున్నారు. హత్యకు సంబంధం ఉన్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, హత్యకు పాల్పడిన కర్నూలుకు చెందిన కిరాయి రౌడీల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు.

    పోలీసుల హెచ్చరిక:
    ములుగు జిల్లాలో ఇకపై ఏమైనా భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ ఎవరైనా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ హెచ్చరించారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు