హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: తల్వార్, పిస్టల్ చూపించి భూ కబ్జాలు.. ఉమ్మడి వరంగల్‌లో కొనసాగుతున్న నయీమ్ గ్యాంగ్ ఆగడాలు

Mulugu: తల్వార్, పిస్టల్ చూపించి భూ కబ్జాలు.. ఉమ్మడి వరంగల్‌లో కొనసాగుతున్న నయీమ్ గ్యాంగ్ ఆగడాలు

వరంగల్ నగరంలో నయీమ్ గ్యాంగ్ కబ్జాలు

వరంగల్ నగరంలో నయీమ్ గ్యాంగ్ కబ్జాలు

కరుడుగట్టిన నేరస్థుడు నయీమ్ మరణించినా నయీమ్ గ్యాంగ్ సభ్యుల ఆగడాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలలో భూకబ్జాలకు పాల్పడుతు, తుపాకీ, తల్వార్లు చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

ఇంకా చదవండి ...

(M.Venu, News 18, Mulugu)

కరుడుగట్టిన నేరస్థుడు నయీమ్ మరణించినా నయీమ్ గ్యాంగ్ సభ్యుల ఆగడాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలలో భూకబ్జాలకు పాల్పడుతు, తుపాకీ, తల్వార్లు చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు. కేయూ సబ్ ఇన్స్పెక్టర్ బండారి సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. హసనపర్తి మండలానికి చెందిన కేతపాక రమేష్, భీమారంకు చెందిన బొజ్జ హరిబాబు, శాయంపేట మండలానికి చెందిన అలువాల నరేష్, సిద్ధాపురం గ్రామానికి చెందిన మేకల రమేష్, హసనపర్తి మండలానికి చెందిన పంగ రవి, భీమారానికి చెందిన ప్రవీణ్‌లు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి పలివెల్పుల క్రాస్ వద్ద ఫార్చునర్ కారు అనుమానాస్పదంగా, అతివేగంగా వెళ్లడంతో పోలీసులు దానిని వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా... కారు డిక్కీలో తల్వార్, తుపాకీ వంటి మారణాయుధాలు లభించాయి. కారులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా ప్రధాన నిందితుల పేర్లు బయటికి వచ్చాయి. ప్రధాన నిందితులుగా ఓదెలకు చెందిన ముద్దసాని వేణుగోపాల్, మంచిర్యాల జిల్లాకు చెందిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, మొగుళ్లపల్లికి చెందిన మాజీ ఎంపీపీ మల్లన్న డ్రైవర్ క్రాంతి కుమార్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నయీమ్ గ్యాంగ్ సభ్యుడు వేణుగోపాల్ ఈ వ్యవహారాలన్నీ నడిపించినట్లు తెలుస్తుంది. నగరంలోని పలువురు వ్యక్తులను మారణ ఆయుధాలతో బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసి వారి భూములను ఆక్రమించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిపై ఐపిసి 386, 506, రెడ్ విత్ 34 ఐపీసీతో పాటు 25 (1)(A) ఆర్మ్డ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంపత్ ఎక్కడ?: ఆరుగురు భూకబ్జాదారులను విచారించిన కేయూ పోలీసులకు పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాలలో ఆర్ఐ సంపత్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌ను కూడా చూపించి వ్యక్తులను బెదిరించి భూకబ్జాలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులకు సుమార్క్ అనే ప్రోగ్రాం ద్వారా ఉచిత కోచింగ్ నిర్వహిస్తూ యువతకు చాలా దగ్గరయ్యాడు ఆర్ఐ సంపత్ కుమార్. ఈక్రమంలో ఒక్కసారిగా సంపత్ పై ఆరోపణలు రావడంతో అతని వద్ద శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పరారీలో ఉన్న నలుగురు సభ్యుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. నిందితుల గురించి సమాచారం లభిస్తే 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

వారు చేసిన ఆగడాలు: ఓ న్యాయవాది భూమిని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసి కొద్ది రోజుల్లోనే రూ. 2 కోట్లకు విక్రయించారు. బట్టుపల్లి, ఎల్లాపూర్, హన్మకొండ, కోమిరెడ్డిపల్లి, గోపాల్‌పూర్, చింతగట్టు తదితర ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ భూకబ్జాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 315 గజాల ఇంటి స్థలం కోసం ఇద్దరు వృద్ధులను సైతం రెండు రోజుల పాటు బలవంతం చేసి, వారి నుంచి భూమి రాయించుకొని కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలిసింది. ముద్దసాని వేణుగోపాల్, సంపత్ కుమార్‌కు హన్మకొండ పెద్దమ్మగడ్డ సమీపంలో కాకతీయ కాలనీ ఫేజ్ 2లో సొంత ఇల్లు ఉంది. ఈ ఇంటిలోనే సెటిల్మెంట్లు, బెదిరింపులు, వ్యక్తులను నిర్బంధించడం, వచ్చిన గెస్ట్‌లకు విందువినోదాలు ఏర్పాటు చేసేవారు. పరారీలో ఉన్న నలుగురు సభ్యులు చిక్కితేగాని అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

First published:

Tags: Crime news, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు