Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) లో జరిగిన ఒక ఘటన కలకలం సృష్టించింది. ఈ వార్త సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అయిపోయింది. వార్త ఎందుకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పల్లె ప్రాంతాలలో ప్రజలకు సీరియల్స్ పై కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట ఏదో ఒక పనికి వెళ్లిన వారు ఇంటికి వచ్చి సాయంత్రం విశ్రాంతి కోసం టీవీని చూస్తూ ఉండటం.. సీరియల్ పై ఎక్కువ అభిమానాన్ని కనబరచడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. గతంలో కార్తీక దీపం సీరియల్ గురించి అనేక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ జరిగాయి. కానీ అదే కార్తిక దీపం సీరియల్ వల్ల ఒక దుకాణదారుడు యజమాని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
అసలేం జరిగింది..?
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని పాలంపేట గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం. మగవారు వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం కల్లు తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అదే తరుణంలో ఆలంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బెల్ట్ షాప్ వద్దకు వెళ్లి మందు అడిగాడు. యజమాని కార్తీక దీపం సీరియల్ చివరి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతున్న సమయం అది. యజమాని వచ్చి మందు ఇచ్చి మళ్లీ సీరియల్స్ చూడడం కొనసాగించాడు. అయితే, కొనుగోలుదారు మళ్ళీ ఇంకొంచెం మందు కావాలని అడిగాడు.
అయితే అదే సమయంలో దుకాణం యజమాని సీరియల్ చూస్తూ ఉన్నాడు. ఎంతకీ రాకపోయేసరికి మళ్ళీ కొనుగోలు దారుడు పిలిచాడు. దీంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి దుకాణదారు యజమానికి చిరాకేసింది. ఒకవైపు కార్తీక దీపం చివరి ఎపిసోడ్ సాగుతున్న సమయంలో విసుగు తెప్పిస్తున్నాడని ఏకంగా వినియోగదారుడి చూపుడువేలు కొరికేశాడు.
దీంతో వినియోగదారుడు వెంటనే పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న వెంకటాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ దుకాణదారు యజమానిపై కేసు నమోదు చేశాడు. ఈ నోటా ఆ నోటా ఈ వార్త వైరల్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ప్రధాన దినపత్రికల్లో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త తెగ వైరల్ అయిపోయింది. సీరియల్స్ పై ట్రోలింగ్ రావడం సహజం కానీ ఇలా సీరియల్స్ వల్ల కేసుల పాలవ్వడం ఇదే మొదటిసారి కావచ్చు. పాపం ఇదే విషయం వంటలక్క డాక్టర్ బాబుకు తెలిస్తే గాయపడ్డ వ్యక్తిని పరామర్శించడానికి వచ్చేవారు కావచ్చని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Local News, Mulugu, Telangana