Home /News /telangana /

MULUGU ITS BEEN THREE YEARS SINCE CONDUCTING GOVERNING BODY MEETING IN ITDA ETURNAGARM MMV BRV PRV

Mulugu: గాలిలో దీపంలా 3 లక్షల మంది గిరిజనుల బతుకు.. నిర్లక్ష్యంగా ఐటీడీఏ తీరు!

అలంకారప్రాయంగా ఐటీడీఏ ఏటూర్ నాగారం

అలంకారప్రాయంగా ఐటీడీఏ ఏటూర్ నాగారం

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ( ఐటిడిఏ)! గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటైన సంస్థ. తమ సమస్యలు పరిష్కరించి, తమ అభివృద్ధికి తోడుగా నిలవాల్సిన ఐటీడీఏలో నేడు నిర్లక్ష్యధోరణి కనిపిస్తుంది. నేటికీ గిరిజన ప్రజలు చెప్పుకోలేనన్ని ఇబ్బందులు పడుతున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ( ఐటిడిఏ)! గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటైన సంస్థ. తమ సమస్యలు పరిష్కరించి, తమ అభివృద్ధికి తోడుగా నిలవాల్సిన ఐటీడీఏలో నేడు నిర్లక్ష్యధోరణి కనిపిస్తుంది. నేటికీ గిరిజన ప్రజలు చెప్పుకోలేనన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు గిరిజనులు (Tribal people). గిరిజన కష్టాలను ఐటీడీఏ పట్టించుకోవడం లేదు. ఏటూర్‌నాగారం ఐటీడీఏ (ITDA) పరిధిలో అనేక గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి (Godavari) నది పరివాహకం గిరిజన గ్రామాల్లో అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి అరకొర సహాయం అందినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపించడంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ విఫలం అవుతూనే ఉందన్నది స్థానికుల వాదన.

    ఐటీడీఏ ( సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ) ఏర్పాటు: 1986 మే 21న ఐటీడీఏ... ఏటూర్‌నాగారంలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేయడం. ఏటూర్‌నాగారం ఐటీడీఏ పరిధిలో మొత్తం 13 ఏజెన్సీ మండలాలు 270కి పైగా గ్రామపంచాయతీలు, 550కి పైగా రెవెన్యూ గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటి మొత్తం జనాభా 3 లక్షల పై మాటే. వీరికి అనేక పథకాల ద్వారా సదుపాయాలు అందించాల్సి ఉంటుంది. కానీ దానిలో ముఖ్య పాత్ర పోషించేది ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు. పాలకమండలి సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఏటూర్‌నాగారంలో ఇందుకు విరుద్ధంగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క పాలకమండలి సమావేశం నిర్వహించలేదు. ఐటీడీఏ పాలకమండలి చివరి సమావేశం 2019 డిసెంబర్లో జరిగింది. మళ్లీ ఇప్పటివరకు సమావేశం ఏర్పాటు చేసింది లేదు.



    దీంతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ ఏ విధంగా ఖర్చు అవుతుంది? వాటి ద్వారా ఎంతమంది లబ్ది పొందుతున్నారు? వంటి విషయాలతో పాటు గ్రామాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా పాలకమండలి సమావేశాల్లో చర్చించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల నుంచి సమావేశం నిర్వహించకపోవడంతో ఐటీడీఏలో పాలన కుంటుపడింది. అడిగే వారు లేరు పర్యవేక్షించేవారు అసలే లేరు. దొరికిన వారికి దొరికినంత అన్న విధంగా అధికారుల ప్రవర్తన ఉంటుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతలా మారిందంటే ఏకంగా ఒక ఉన్నత అధికారి కొన్ని రూ. కోట్లు స్కాం చేశాడని, అందుకే బదిలీపై వెళ్ళాడని ఐటీడీఏ ఆఫీసుతో పాటు ములుగు జిల్లా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారట.

    పనిచేయని ఐటీడీఏ వెబ్‌సైట్:

    ఐటీడీఏ ఏటూర్‌నాగారానికి సంబంధించి www.itdaeturnagaram.com ప్రత్యేక వెబ్‌సైట్ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఇది కొన్ని సంవత్సరాలుగా పనిచేయడం లేదు. ఐటిడిఏ పరిధిలోని నిరుద్యోగులు, మేధావులు, చదువుకున్నవారు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలంటే ఐటీడీఏ ప్రధాన కార్యాలయం వరకు వెళ్లాల్సి వస్తుంది. ఐటీడీఏకు సంబంధించిన ప్రతి విషయాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే ఎవరికి కావాల్సిన వివరాలు వారు చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానిక యువత అంటున్నారు.

    ఐటీడీఏ పాలకమండలి సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో గిరిజన గ్రామాల ఇబ్బందులు, గిరిజనుల కష్టాలను, వాటికి సంబంధించిన చర్యలపై చర్చించాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం పలు పథకాలను రూపొందించారు. వాటిని ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి అనే విధివిధానాలన్నీ కూడా పాలకమండలి సమావేశంలో చర్చించాల్సి ఉంటుంది. కానీ మూడు సంవత్సరాల నుంచి సమావేశం నిర్వహించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. గిరిజనులు ఆర్థికంగా ఎదగడం కోసం ట్రైకార్ లోన్స్, ప్రత్యేకమైన రాయితీలతో కూడిన లోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వందమంది లోన్ కోసం అప్లై చేస్తే కేవలం ఒక్కరికి లోన్ ఇచ్చి తూతూ మంత్రంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

    లెక్కల్లో బొక్కలు: గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో అనేక పథకాల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నా వాటి లెక్కలకు సంబంధించి ఆడిట్ జనరల్ వచ్చి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఐటీడీఏకు ఆడిట్ అధికారులు రాకపోగా... ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లెక్కలు చేయించి హైదరాబాద్ శాఖకు లెక్కలు అప్పచెబుతున్నారని గిరిజనులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. లెక్కలు సరిగా జరగడం లేదని అదును చూసి ఒక ఉన్నత అధికారి రూ. మూడు కోట్లకు పైగానే ఐటీడీఏలో స్కాం చేశాడని గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకొని గిరిజన గ్రామాలకు గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని ఐటీడీఏ పరిధిలోని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Mulugu, Tribes

    తదుపరి వార్తలు