(Venu Medipelly, News18, Mulugu)
వ్యవసాయంలో (Agriculture) ఆశించిన లాభాలు రాకపోవడంతో రైతులు (farmers) తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సాంప్రదాయ పంటలకు అలవాటు పడిన అన్నదాతలు మరో ప్రత్యామ్న్యాయ పంటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఫలితంగా ఏ ఏటికాయేడు పంటలపై పెట్టుబడి అధికం అవుతుండగా, దిగుబడి తగ్గి లాభాలు లేకుండా పోతున్నాయి. ఈ పరిస్థితులన్నీ గమనించిన ఓ రైతు.. వ్యవసాయాన్ని లాభాల పట్టించడంలో అన్ని ప్రయత్నాలతో అలసిపోయి చివరగా పంట మార్పిడి కోసం ఆలోచించాడు. అదే సమయంలో ఆయిల్ పామ్ సాగు గురించి తెలుసుకున్న ఆ రైతు తనకున్న 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు.
20 లక్షల ఎకరాల్లో సాగు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ (Oil palm) సాగుపై విస్తృత ప్రచారం జరుగుతుంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత దేశంలో వంట నూనెలపై పడింది. ఆసియాలోని ఇతర దేశాల నుంచి వచ్చే నూనె దిగుమతులు రాకపోవడంతో భారతదేశంలో వంట నూనె ధర రికార్డు స్థాయిలో పెరిగింది. భారతదేశంలో వంటే నూనెల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకేసారి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంటలకు తోడ్పాటు ఇస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు (Oil palm Cultivation)చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని గతంలోనే తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది. 2022- 23 సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ పంట సాగు చేసే రైతులకు ఎకరానికి మొదటి ఏడాది రూ. 26,000, రెండవ ఏడాది ఎకరానికి రూ. 5000, మూడవ ఏడాది ఎకరానికి రూ. 5000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించారు.
ఆయిల్ పామ్ సాగుపై రైతుల దృష్టి:
మన దేశంలో పామ్ ఆయిల్ (Palm Oil)కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ ఫామ్ నిల్వలు సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. సాంప్రదాయ పంటలకు బిన్నంగా ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలంలో లాభాలు వస్తాయన్న నమ్మకం, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుండడంతో రైతులు కూడా ఆయిల్ పామ్ సాగుపై మొగ్గు చూపుతున్నారు. ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట్ మండలం చల్వాయి గ్రామానికి చెందిన బండమీద కుమారస్వామి అనే రైతు గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయినా ఆశించినంత లాభాలు లేకపోవడం, సాగు శ్రమ ఎక్కువగా ఉండడంతో రైతు దిగాలు చెందాడు. అదే సమయంలో ఆయిల్ పామ్ సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు కల్పిస్తున్న అవగాహనా కార్యక్రమాల ద్వారా ఆ పంట గురించి పూర్తి వివరాలు సేకరించాడు రైతు కుమారస్వామి. తనకున్న 5 ఎకరాల పొలంలో ఆయిల్ ఫామ్ పంట వేసి తాడ్వాయి మండలంలోనే ఆయిల్ ఫామ్ సాగు చేసిన మొదటి రైతుగా నిలిచాడు.
ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాల లాభాలు:
"వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన సూచన మేరకు నాకు ఉన్న భూమిలో ఐదు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలను వేశాను. పంట వేసిన అనంతరం మూడు సంవత్సరాల తరువాత నెలకు రెండు కోతల చొప్పున సంవత్సరానికి 12 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు చెప్తున్నారు. టన్ను ఆయిల్ పామ్ ధర రూ. 20 నుంచి రూ. 22 వేల మధ్యలో ఉంటుంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 2 - 3 లక్షల ఆదాయం ఉంటుంది" అని రైతు కుమారస్వామి చెప్పుకొచ్చాడు. ములుగు జిల్లాలోని ఇతర రైతులు కూడా ఇప్పుడిప్పుడే ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు. ములుగు జిల్లాలో కేఎన్ బయోసైన్స్ అనే కంపెనీ పంటను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. రైతులు ముందుకొచ్చి అధికమొత్తంలో ఈ పంటను సాగు చేస్తే నూనె తయారీ కంపెనీ కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలకు ఎటువంటి అర్హతలు ఉండాలి?
రైతుకు ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేకున్నా వ్యవసాయం మీద అవగాహన ఉంటే సరిపోతుంది. పొలానికి మాత్రం పట్టా పాసుపుస్తకం కచ్చితంగా ఉండాలి. దానితో పాటుగా పంట పొలాల్లో బోర్ పంపు కూడా అందుబాటులో ఉండాలి. పొలంలో 9X9 చొప్పున దూరంలో ఎకరానికి 50 మొక్కల వరకు పెట్టవచ్చు. ఒక ఆయిల్ పామ్ మొక్క ధర రూ. 117 ఉండగా సబ్సిడీ అనంతరం రైతుకు రూ. 33లకే అందిస్తుంది ప్రభుత్వం. మొక్కలకు నీరు అందించే డ్రిప్ ఇరిగేషన్‌కు 90% సబ్సిడీ ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ రైతులకు పొలానికి పట్టా పుస్తకం, బోరు పంపు ఉంటే 100 శాతం సబ్సిడీ అందుతుంది. ములుగు జిల్లాలోని రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి ఉన్నా, ఇతర సందేహాలు కోసం స్థానిక ఉద్యానవన అధికారి వేణు మాధవ్‌ను సంప్రదించవచ్చు.
ఉద్యానవన అధికారి వేణుమాధవ్: 7997725149
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Farmer, Local News, Mulugu