రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లొకేషన్ : ములుగు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల్లో అనేక ప్రాంతాలలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా ప్రాంతంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వర్షపాతం ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని ఆలుబాక ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 13 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది.
TS News: రిజిస్ట్రేషన్ చేలేదా.. పెట్రోల్ పోసి చంపేస్తాం.. ఎమ్మార్వోకి బెదిరింపులు
ముఖ్యంగా గతంలో వర్షాకాలం సమయంలో భారీ వర్షాలు కురవడంతో పాటు వాగులు వంకలు పొంగిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎండాకాలంలో వడగండ్ల వానతో ఇంతలా బీభత్సం సృష్టించిన సంఘటనలు ములుగు జిల్లా చరిత్రలోనే కనిపించవు. కానీ ఈ ఏడాది ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పెద్ద పెద్ద వర్షపు రాళ్లు, ఈదురు గాలులు, భారీ వర్షం చూస్తూ ఉంటే ఊరు మొత్తం కొట్టుకుపోతుందా అనే స్థాయిలో హడలెత్తించింది. ఇంటి పైకప్పుగా రేకులు ఉన్నట్లయితే వడగండ్ల ప్రభావంతో రంధ్రాలు కూడా పడ్డాయంటే వర్ష బీభత్సం ఏవిధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకుందే అందుకు..పీపుల్స్ మార్చ్ యాత్రలో భట్టి కీలక వ్యాఖ్యలు
భారీ వర్షాలకు ములుగు జిల్లాలో అనేక మంది రైతులకు అపారమైన పంట నష్టం కలిగింది. ముఖ్యంగా ఉగాది సీజన్ కావడంతో వడగండ్ల వానతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోయారు. కేవలం రెండు రోజుల్లో పంటను మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకోవడమే ఆలస్యం అనగా.. ఒక్కసారి ప్రకృతి రైతన్నపై కన్నెర్ర చేసింది. చేతికి వచ్చిన పంట వడగండ్ల వాన పాలైంది. ములుగు జిల్లా ప్రాంతంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే మిర్చి రైతులకు సైతం అపారమైన నష్టాన్ని కలిగించింది ఈ చెడగొట్టు వాన.
ఈసారి పంట బాగా వచ్చింది..అనుకున్నట్టే మార్కెట్లో కూడా మిర్చికి మంచి డిమాండ్ ఉంది.. అప్పులన్నీ తీర్చేయవచ్చు అనే సంతోషంలో ఉన్న మిర్చి రైతులపై వానదేవుడు ఆగ్రహించాడు కావచ్చు. కోతకోసి కల్లాలలో ఆరబోసిన మిర్చి వడగండ్ల వానలో తడిసి ముద్దయిపోయింది. మిర్చి కల్లాలు మొత్తం వర్షపు నీటితో నిండిపోయాయి. లక్షల్లో పంట నష్టం వాటిల్లింది. కాలంగాని కాలంలో చెడగొట్టు వానలు రైతులను నిండా ముంచాయి. తమ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana