హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: స్టేట్​ ర్యాంకులతో రికార్డులు సృష్టిస్తున్న ములుగులోని ప్రభుత్వ పాఠశాల.. వివరాలివే

Mulugu: స్టేట్​ ర్యాంకులతో రికార్డులు సృష్టిస్తున్న ములుగులోని ప్రభుత్వ పాఠశాల.. వివరాలివే

X
ర్యాంకులు

ర్యాంకులు సాధించిన విద్యార్థులతో టీచర్లు

ములుగు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ర్యాంకుల ప్రభంజనం సృష్టిస్తున్నారు. ర్యాంకులు సాధించడం తమకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా ఇక్కడ చదివే విద్యార్థులు కచ్చితమైన ర్యాంకులు సాధిస్తున్నారు

(Venu Medipelly, News18, Mulugu)

మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారా... ప్రభుత్వ పాఠశాల (Government school), కళాశాలల్లో బోధనపై మీకు నమ్మకం లేదా..అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. పరీక్షలు (Exams) ఏవైనా ర్యాంకులు మాత్రం ఆ పాఠశాల విద్యార్థులకే. కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా విద్యా బోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఆదర్శ పాఠశాలలో (Adarsha school) చదువుతున్న విద్యార్థులు ర్యాంకుల ప్రభంజనం సృష్టిస్తున్నారు. ర్యాంకులు సాధించడం తమకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా ఇక్కడ చదివే విద్యార్థులు కచ్చితమైన ర్యాంకులు (State Ranks) సాధిస్తున్నారు. ఉపాధ్యాయుల విద్య బోధన కూడా అదే స్థాయిలో ఉంటుంది. గోవిదారావుపేట మోడల్ పాఠశాలలో (Govindarao peta model school) 500 మంది స్కూల్ విద్యార్థులు, 240 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. మొత్తం 740 మంది విద్యార్థులు ఈ మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల నుంచి మొత్తం 184 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 180 మంది ఉత్తీర్ణులయ్యారు. ములుగు జిల్లాలో 98 శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక ప్రభుత్వ పాఠశాలగా గోవిందరావుపేట మోడల్ స్కూల్ రికార్డు సృష్టించింది.

పాఠశాల విద్యార్థుల ప్రతిభ, సాధించిన రికార్డ్స్:

ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో (In the Telangana Intermediate results) ఈ మోడల్ స్కూల్‌లో చదివిన ఏ.సంగీత 464/470 (ఎంపీసీ) మార్కులు సాధించి స్టేట్ ఐదవ ర్యాంకును సొంతం చేసుకుంది. డి.ఆశ్రిత 433/440(బైపిసి) మార్కులతో స్టేట్ ఏడవ ర్యాంకు స్వాధీనం చేసుకుంది. ఇంటర్మీడియట్ ఫలితాలలో 98 ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచింది ఈ పాఠశాల. ఇందులో చదివే ఇద్దరు విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన జాతీయస్థాయి మెరిట్ స్కాలర్షిప్ NMMSకు ఎంపికయ్యారు. వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి రూ. 12,000 ఉపకారవేతనం అందుతుంది. ఇవే కాకుండా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు కూడా ఈ పాఠశాల విద్యార్థులు ఎంపిక అయ్యారు.

పాఠశాలలో సదుపాయాలు: గోవిందరావుపేట మండలం చల్వాయిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో సువిశాలంగా కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా అందిస్తున్నారు. వంద మంది విద్యార్థినిలకు సరిపడా బాలికల హాస్టల్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందుతాయి. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. త్రాగునీటి కోసం ఏకంగా స్కూల్లోనే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

అభినందనల వెల్లువ: గోవిందరావుపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల జిల్లా అధికారులు పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నారు. ఉత్తీర్ణత శాతంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిన ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను ములుగు విద్యాశాఖ అధికారి ఫణిని అభినందించారు. గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు రావడం చాలా సంతోషంగా ఉందని మండల విద్యాశాఖ అధికారి గొంది దివాకర్ చెప్తున్నారు. "చేతిలో డబ్బున్న కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. కానీ వ్యవసాయం మీద, కూలి పనుల మీద ఆధారపడి జీవించే మేము ప్రభుత్వ పాఠశాలనే మాత్రమే నమ్ముకున్నాము. మా కష్టానికి ప్రతిఫలంగా మా పిల్లలు సాధించిన ర్యాంకులను చూసి మాకు చాలా ఆనందంగా ఉందని\" మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు న్యూస్18తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

జిల్లాలోనిపాఠశాలలో వసతుల లేమి:

ములుగు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఉత్తీర్ణత శాతంలో ముందుకు వెళుతున్నాయి. విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండగా, ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. పాఠశాలను అగ్రగామిగా నిలిపేందుకు వేరు ఇంత కృషిచేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ పాఠశాలలను చిన్న చూపు చూస్తుంది. జిల్లాలోని కొన్ని పాఠశాలలో సరైన తరగతి గదులే లేవు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంలోనూ ప్రభుత్వం విఫలం అవుతుంది. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాలు 50 శాతం మంది విద్యార్థులకు కూడా సరిపోలేదు. ఉపాధ్యాయులు శక్తికి మించి బోధించినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువుతుందని వారు వాపోతున్నారు. సరైన వసతులు కలిపిస్తే మరిన్ని విజయాలు అందిస్తామని ఉపాధ్యాయులు, విద్యార్థులు అంటున్నారు.

First published:

Tags: Intermediate exams, Local News, Mulugu, Telangana Inter Results, TS Inter Results 2022

ఉత్తమ కథలు