(Venu Medipelly, News18, Mulugu)
ములుగు (Mulugu) నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్ 3, గ్రూప్ 4, డీఎస్సీ మరియు గురుకులం ఉద్యోగాలకు (Telangana Jobs) సన్నద్ధం అయ్యే వారికి ఈ సదా అవకాశం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏర్పాటు జరిగిన తర్వాత పది ఉమ్మడి జిల్లా కేంద్రాలలో బీసీ స్టడీ సెంటర్ల (BC Study Centers) నిర్వహణ కొనసాగేది. బీసీ స్టడీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ (Free Coaching)ఇస్తున్నారు. బీసీ స్టడీ సెంటర్లో సీటు కోసం నిరుద్యోగ అభ్యర్థులలో తీవ్ర పోటీ నెలకొనేది. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా అనేకమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని సీటు లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగేవారు. నాణ్యమైన ఉచిత శిక్షణ ఇవ్వడంలో బీసీ స్టడీ సెంటర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ లభించే స్టడీ మెటీరియల్ కూడా అత్యంత ప్రామాణికత నాణ్యతతో ఉంటుంది.
ములుగు జిల్లాలో బీసీ స్టడీ సెంటర్
తెలంగాణ ఏర్పాటు చేసిన అనంతరం ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత ములుగు జిల్లాకు బీసీ స్టడీ సెంటర్ మంజూరు అయింది. గతంలో ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు బీసీ స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలంటే హన్మకొండ, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి ఉండేది. ఇంత దూరం నుంచి వెళ్లినా కొందరికి మాత్రం స్టడీ సెంటర్లో సీటు లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగేవారు. కానీ మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో నిరుద్యోగ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే సీటు మీ సొంతం అనే విధంగా ఏకకాలంలోనే నాలుగు రకాల ఉద్యోగాలకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఉపాధి నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 50 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు: ములుగు జిల్లాకు కొత్తగా మంజూరైన బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. దరఖాస్తు చేసుకునే వారికి ఉచిత తరగతులను డిగ్రీ కళాశాలలో అందిస్తారు. నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే tsbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. అభ్యర్థులు నేరుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు.
ములుగు జిల్లాలో మొదటిసారిగా బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల తాము సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి లేకుండా సమయం ఆదా అవుతుందని అభ్యర్థులు చెప్తున్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9492365883 నెంబర్ ని సంప్రదించవచ్చు. ములుగు జిల్లాలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bc study circle, Free coaching, Local News, Mulugu, Telangana jobs