Venu, News18, Mulugu
గ్రామీణ ప్రాంతాలలో చాలామంది గుడుంబా, నాటు సారాకు బానిస అవుతుంటారు. కానీ అవి సేవించడం వల్ల వచ్చే అనర్ధాల గురించి వారికి తెలియదు. దీంతో జరగరాని ఘటన ఏదైనా జరిగితే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. అలాంటి ఘటనలు మనం తరచూ వింటూనే ఉంటాం. గుడుంబా నాటు సారాను అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. వారికి సమాచారం రాగానే తమ సిబ్బందితో వెళ్లి గుడుంబా నాటు సారా నిలువలను ధ్వంసం చేస్తూ పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ములుగు జిల్లా (Mulugu District) ఏజెన్సీ ప్రాంతంలో గుడుంబా, నాటుసారా ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎక్కువగా ఏటూర్ నాగారం ప్రాంతంలోని ముళ్లకట్ట వంతెన మీదుగా గుడుంబా రవాణా జరుగుతుంది. తరచూ ముళ్లకట్ట వంతెనపై పోలీసులు నిఘా పెట్టినప్పుడు వారికి భారీ స్థాయిలో సారా నిలువలు పట్టుబడడమే అందుకు నిదర్శనం.
ఏజెన్సీ ప్రాంతంలో నాటు సారా, గుడుంబా వినియోగంపై.. తయారీదారులపై ఏటూర్ నాగారం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో అధికారులు, కానిస్టేబుల్స్ బృందం ఉక్కు పాదం మోపుతుంది. ఈ నేపథ్యంలోనే తయారీదారులు సైతం ఎక్సైజ్ పోలీసులకు దొరకకుండా ఉండేలా బెల్లం పానకం నిల్వలను వివిధ ప్రాంతాలలో దట్టమైన అటవీ ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాలలో దాస్తూ ఉంటారు. కానీ ఎక్సైజ్ శాఖకు సమాచారం రావడంతో ఎంత దూరమైనా, ఎంత దట్టమైన అటవీ ప్రాంతమైనా వెళ్లి వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకే ఏటూరు నాగారానికి చెందిన ఒక వ్యక్తి వెరైటీగా ఆలోచించాడు.
మండల కేంద్రంలోనే గుడుంబా బెల్లం పానకం నిల్వలను దాచి పెట్టాడు. నిత్యం ప్రజలు తిరిగే చోటే అనుమానం రాకుండా బెల్లం పానకం నిల్వలు పెట్టాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ బృందం తనిఖీలు నిర్వహించారు. దీంతో బెల్లం పానకం నిల్వ చేసిన ప్రదేశం చూసి ఎక్సైజ్ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. తయారీదారుడు బెల్లం పానకం నిలువలను ఏకంగా మరుగుదొడ్డి సెప్టిక్ ట్యాంక్ లో నిలువ చేసి ఉంచాడు.
వీటిని చూసిన ఎక్సైజ్ పోలీసులు వెంటనే దాదాపు 1200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికైనా నాటు సారా గుడుంబా సేవించడం మానేయాలని, ఇవి పూర్తిగా ఆరోగ్యానికి హానికరమని, తయారీదారులు వారి స్వలాభం కోసం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలకు అవగాహనా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజలు నాటు సారా, గుడుంబాకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ ప్రజలకు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana