(M.Venu, News 18, Mulugu)
సాధారణంగా ఎగ్జామ్స్ (Exams) అంటే ఎంతో హడావిడి ఉంటుంది. ప్రశ్నపత్రాల తరలింపు నుంచి.. పరీక్ష కేంద్రం నిర్వహణ, విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు వంటి అనేక విషయాలతో అధికారులు తలమునకలై ఉంటారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో వందలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. పరీక్షల నిర్వహణ సైతం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు, పరీక్షలు పూర్తవగానే ఎంతో ఉపశమనం పొందుతారు. మళ్లీ ఫలితాలు వెలువడ్డాక, పరీక్ష తప్పిన విద్యార్థులు తిరిగి సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మంచి మార్కులు తెచ్చుకుంటారు. సప్లిమెంటరీ పరీక్షలకు సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు విద్యాశాఖ అధికారులు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ (Tenth class Advanced supplementary) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నేపథ్యంలోనే ములుగు జిల్లా ఏటూరునాగారం ఉన్నత పాఠశాలలో (Eturunagaram High school) ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఏటూరునాగారం పాఠశాలలో హిందీ పరీక్ష (Hindi Exam) నిర్వహించారు. కానీ హిందీ పరీక్షకు మాత్రం హాజరైన విద్యార్థుల (students) సంఖ్య చూస్తే షాక్ గురవుతారు. కేవలం ఒకేఒక్క విద్యార్థి ఈ పరీక్షకు హాజరయ్యాడు. సాధారణంగా పదో తరగతి పరీక్ష ఫలితాలలో హిందీ సబ్జెక్ట్ అందరూ పాస్ అవుతారు. కానీ కాటాపూర్‌కి చెందిన ఇ.సాయి (Sai) అనే విద్యార్థి తన సోదరి వివాహం ఉన్నందున మొదట జరిగిన హిందీ పరీక్షకు హాజరు కాలేకపోయాడు. దీంతో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష రాసేందుకు తిరిగి అప్లై చేసుకున్నాడు.
ఇక ఇక్కడి పరీక్షా కేంద్రంలో ఒక్క విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేందుకు వచ్చాడు. అయితే అతన్ని పర్యవేక్షించేందుకు మాత్రం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కలిపి ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహించారు. వారిలో ఒక డిపార్ట్మెంటల్ అధికారి, ఒక సీసీ, ఒక ఇన్విజిలేటర్, ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు విద్యార్థి అనుభవాన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
హుజూరాబాద్లో..
కాగా, ఇలా చాలాసార్లు జరిగింది. గతంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పదో తరగతి పరీక్ష రాయడానికి ఒకే విద్యార్థి హాజరయ్యాడు. పట్టణంలోని న్యూ శాతవాహన ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలిరోజు తెలుగు పరీక్ష రాయడానికి శ్రీకాంత్ అనే విద్యార్థికి మాత్రమే ఈ కేంద్రాన్ని కేటాయించారు. ఒక్క విద్యార్ధి కోసం ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వహించారు. పరీక్షా కేంద్రానికి సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, ఇన్విజిలేటర్, ఆరోగ్య సహాయకుడు, ముగ్గురు పోలీస్ సిబ్బంది, అటెండర్ వంటి ఉద్యోగులు విధులు నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, Local News, Mulugu, Tenth class