Venu Medipelly, News18, mulugu
ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కోటి మందికి పైగా భక్తులు ఈ దేవతలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఈ జాతర మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తూ ఉంటారు. మేడారం మహా జాతర కుంభమేళా నిర్వహించిన అనంతరం సరిగ్గా సంవత్సర కాలానికి చిన్న జాతరను నిర్వహిస్తూ ఉంటారు.
Read Also : Mulugu: రామప్పలో మరిన్ని సౌకర్యాలొస్తాయ్.. ఆర్థిక శాఖ అధికారుల పర్యటన
దీనినే అక్కడి ఆదివాసి ప్రజలు మండమేలిగే పండుగ అని పిలుస్తూ ఉంటారు. భక్తులు మాత్రం మినీ జాతరగా చెప్పుకుంటారు. ఈ మహా జాతరను 2022వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా ములుగు జిల్లా యంత్రాంగం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించింది. 2023 సంవత్సరంలో మినీ జాతరను నిర్వహించాల్సి ఉంది. పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధమైన జగ్గారావు ఆధ్వర్యంలో తేదీలను నిర్ణయించారు.
మినీ జాతరకు వేళాయె
మినీ జాతరకు మేడారం పూజారుల సంఘం తేదీలను నిర్ణయించింది. 2023 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి నాలుగవ తారీఖు వరకు ఈ మినీ జాతరను నిర్వహిస్తున్నారు. 01/02/2023-బుధవారం, 02/02/2023-గురువారం, 03/02/2023-శుక్రవారం, 04/02/2023-శనివారం నాలుగు రోజులపాటు ఈ జాతరను నిర్వహించనున్నారు.
మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. అలాగే మినీ జాతరకు కూడా లక్షల్లో భక్తులు మేడారం ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. 2021లో నిర్వహించిన మినీ జాతరకు ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చారని అంచనా. మొదట్లో చిన్న జాతర కేవలం పూజారులు మాత్రమే నిర్వహించేవారు. 2007 నుంచి ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తుంది. అప్పటినుంచి భక్తులు లక్షల సంఖ్యలో మేడారం మినీ జాతరకు వస్తున్నారు.
ఎంతో ప్రత్యేకత...
మినీ జాతరకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మహా జాతరకు ఏ విధంగా అయితే పూజారులు నియమ నిష్టలతో ఉంటారో మినీ జాతర నేపథ్యంలో కూడా పూజారులు అవే పద్ధతులను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఆలయ శుద్ది, గ్రామ దిగ్భందనం పూజార్ల నిష్టతో అమ్మవార్లను పూజిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలుగా ఉండే ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు జాతరను సందర్శిస్తారు.
భక్తుల సౌకర్యం కోసం..
లక్షల మంది వచ్చే ఈ మినీ జాతరకు భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా జంపన్న వాగు సమీపంలో స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, వస్త్రాలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
చుట్టుపక్కల ప్రాంతాలు చిరకాల గుట్ట, రెడ్డిగూడెం తదితర ప్రాంతాలలో కూడా వాహనాల పార్కింగ్, లైటింగ్ వంటి ఏర్పాట్లు చేయవలసి అవసరం ఉంటుంది. జాతర సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అభివృద్ధి పనులను మొదలుపెట్టి జాతర సమయానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Medaram, Mulugu, Telangana