హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ‘‘మన ఊరు‌‌-మన బడి’’ పథకమే ఆ ప్రభుత్వ పాఠశాలకు శాపంగా మారిందా?.. మరి విద్యార్థుల పరిస్థితేంటి?

Mulugu: ‘‘మన ఊరు‌‌-మన బడి’’ పథకమే ఆ ప్రభుత్వ పాఠశాలకు శాపంగా మారిందా?.. మరి విద్యార్థుల పరిస్థితేంటి?

X
చల్వాయి

చల్వాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు

గతమెంతో ఘనం, భవిష్యత్తు శున్యం అన్నచందంగా తయారైంది ఆ పాఠశాల పరిస్థితి. ప్రాథమిక విద్యతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన ఆ పాఠశాల భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారింది.

(Venu Medipelly, News18, Mulugu)

గతమెంతో ఘనం, భవిష్యత్తు శూన్యం అన్నచందంగా తయారైంది ఆ పాఠశాల పరిస్థితి. ప్రాథమిక విద్యతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన ఆ పాఠశాల భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారింది. పాఠశాల భవనం పూర్తిగా  శిథిలావస్థకు చేరుకుంది. ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి (Chalvai)లోని ప్రాథమిక పాఠశాల దుస్థితిపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

అభివృధికి నోచుకోని పాఠశాల, మాట దాటవేస్తున్న అధికారులు..

ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని ప్రాథమిక పాఠశాల భవనం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల అభివృద్ధి నిమిత్తం పేరెంట్స్ కమిటీ సభ్యులు నాలుగు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా వారి నుంచి స్పందన కరువైంది. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం "మన ఊరు మన బడి" కార్యక్రమం మొదలు పెట్టింది. దీంతో ఈ ప్రాథమిక పాఠశాల సైతం కొంత అభివృద్ధికి నోచుకుంటుందని అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు సైతం భావించారు. అయితే మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి రూ. 30 లక్షలు మాత్రమే నిధులు వస్తుండగా..చల్వాయిలోని ప్రాథమిక పాఠశాల (Primary school) అభివృద్ధికి మాత్రం రూ. 70 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీంతో టెండర్ల రూపంలోనే పాఠశాల కొత్త భవన నిర్మాణం జరుగుతుందని అధికారులు మాట దాటేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం అమలు చేయకుండా ఉంటే, ఇప్పటికే ఈ పాఠశాలకు కొత్త భవనం వచ్చేదని పేరెంట్స్ కమిటీ చైర్మన్ అంటున్నారు.

మండలంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాల..

సాధారణంగా గ్రామాల పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలలో వంద మందికి మించి విద్యార్థులు ఉండడం గగనం. అటువంటిది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి ప్రైమరీ పాఠశాలలో 170 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 170 మంది విద్యార్థులకు గానూ ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ వీరికి సదుపాయాలు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలం అవుతుంది. ఈ పాఠశాలకు ఐదు తరగతి గదులు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ గదులన్నీ పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని గదులలో దుమ్ము ధూళీ పేరుకుపోయి కనీసం కూర్చునేందుకు కూడా వీలులేదు. దీంతో విద్యార్థులు ఆరు బయటే చదువుకుంటున్నారు. పాఠశాలలో కొత్త తరగతి గదులు నిర్మించాలంటూ ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు గత నాలుగేళ్లుగా ఉన్నతాధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. కొత్త తరగతి గదుల నిర్మాణానికి అధికారులు అనుమతి ఇచ్చేలోపే "మన ఊరు మన బడి" కార్యక్రమం అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు పాఠశాల ఇబ్బందులన్నీ ఈ కార్యక్రమం ద్వారానే తీరిపోతాయని చెప్పారు.

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా బోధన..

ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని కాన్వెంట్, కార్పొరేట్ పాఠశాలలో (School) చదివించాలని ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కానీ చల్వాయి గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కాన్వెంట్లోకి పంపే బదులు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. ఉన్న వసతులతోనే కార్పొరేటు పాఠశాలలకు దీటుగా పిల్లలకు విద్యా బోధనను అందిస్తున్నారు ఉపాధ్యాయులు. పాఠశాలకు మెరుగైన వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇంత మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలను అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరగతిగది సమస్యలతో పాటు మంచినీటి సమస్య పాఠశాలను వెంటాడుతుంది. సొంత బోరు ఉన్నా మోటర్ లేని పరిస్థితి. మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులు భోజనం అనంతరం చేతులు, ప్లేట్ లు కడుక్కునేందుకు పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ వాటర్ పై ఆధారపడాల్సి వస్తుంది. అధికారులు త్వరితగతిన స్పందించి చల్వాయి ప్రాథమిక పాఠశాలకు పూర్వవైభవం తేవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Mulugu, School

ఉత్తమ కథలు