MULUGU BOGATHA WATERFALLS IS TOURIST DESTINATION LOCATED IN MULUGU DISTRICT SNR MMV BRV
Mulugu: తెలంగాణ నయాగరాగా మారిన బొగత జలపాతం .. పర్యాటకుల మనసు దోచేస్తున్న టూరిస్ట్ ప్లేస్
(బొగత జలపాతం)
Mulugu: వర్షాకాలం వచ్చిందంటే ఆ జలపాతం పర్యాటకులతో నిండిపోతుంది. పచ్చని కొండల నడుమ, తెల్లటి పాలధారలా జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
(Venu Medipelly,News18,mulugu)
వర్షాకాలం వచ్చిందంటే ఆ జలపాతం పర్యాటకులతో నిండిపోతుంది. పచ్చని కొండల నడుమ, తెల్లటి పాలధారలా జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. తెలంగాణ నయాగరా(Telangana Niagara)గా ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం(Bogatha Falls) గురించే మనం చెప్పుకుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ జలపాతం ఎంతో అందంగా జాలువారుతుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ములుగు(Mulugu)జిల్లా చీకుపల్లి(Cheekupalli)కి వస్తుంటారు.
జలకళ సంతరించుకున్న బొగత:
ములుగు జిల్లా చీకుపల్లి గ్రామ సమీపంలో ఉంది ఈ బొగత జలపాతం. వేసవికాలంలో నీరు లేకపోవడంతో ఈ పర్యాటక ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు మూసివేశారు. సాధారణంగా జూన్ నెలలో తొలకరి వర్షాలకే బొగత జలపాతం జలకళను సంతరించుకుంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జలపాతం వెలవెలబోయింది. ఇక్కడే కాదు మొత్తం ములుగు జిల్లా వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక చిన్నబోయిన పరిస్థితి కనిపించింది. ఈక్రమంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు బొగత జలపాతం తిరిగి పరవళ్ళు తొక్కుతుంది. తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాలకు జలకళ సంతరించుకుంది. బొగత జలపాతం జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల సందర్శనార్ధం ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇస్తున్నారు. నిండు వర్షాలు కురిస్తే జలపాతాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా వచ్చిన సమయంలోనే ఈ జలపాతం గురించి బయట ప్రపంచానికి బాగా తెలిసింది.
పర్యాటకుల తాకిడి, పటిష్ట భద్రత ఇస్తున్న ఫారెస్ట్ అధికారులు:
ములుగు జిల్లా అనేక పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగా ఉంది. ఈ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులతో స్థానికంగా సందడి నెలకొంటుంది. ములుగు జిల్లాలోని బొగత జలపాతాన్ని తిలకించేందుకు వర్షాకాలం సీజన్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే బొగత వాటర్ ఫాల్స్ చూసేందుకు వచ్చే పర్యాటకులు ఇతర పర్యాటకులు చేసే కొన్ని పనులతో అసహనానికి గురవుతుంటారు. జలపాతం వద్ద అనేక మంది పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. నీళ్లలో దిగి ఈత కొట్టడం, ఇతర పర్యాటకులకు ఇబ్బంది కలిగించడం వంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. గతంలో కొందరు పర్యాటకులు నీళ్ళలోకి దిగి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. దీంతో బొగత జలపాతం వద్ద కంచె ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు, పర్యాటకులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు.
జలపాతానికి అనుబంధంగా నీటి కొలను, పార్కు ఏర్పాటు:
జలపాతం చూడగానే ఎవ్వరికైనా మనసు పులకరించిపోతుంది. చిన్నా పెద్ద అంతా కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే బొగత వద్ద గతంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, పర్యాటకులను జలపాతంలోకి అనుమతించడంలేదు అటవీశాఖ అధికారులు. దీంతో జలపాతాన్నీ చూసి, నీటిలో దిగి ఎంజాయ్ చేద్దామనుకుంటు, సుదూర ప్రాంతం నుంచి వచ్చే పర్యాటకులు ఉసూరుమంటున్నారు. దీంతో పర్యాటకుల ఆనందం కోసం ప్రత్యేకంగా జలపాతం వద్ద చిన్న నీటి కొలను ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద చిన్న పిల్లలు ఆడుకోవడానికి అధికారులు పార్కులు కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రోప్ వే సైకిల్, పర్యాటకులు కూర్చోవడానికి షేడ్స్ నిర్మించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి చెప్తున్నారు.
బొగత రూట్ మ్యాప్: బోగత జలపాతం చేరుకోవాలంటే 163 జాతీయ రహదారి వయా ఏటూరునాగారం మీదుగా చీకుపల్లి గ్రామం వరకు వెళ్లాలి. ప్రత్యేకంగా బస్సులు లేవు. పర్యాటకులు తమ సొంత వాహనాల ద్వారా ఈ పర్యాటక కేంద్రానికి చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ కేంద్రం నుంచి 105 కిలోమీటర్ల దూరంలోని ఏటూరునాగారం చేరుకోవాలి. ఏటూరునాగారం వై జంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు వెళ్తే చికుపల్లీ గ్రామంలో ఈ బొగత జలపాతం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది.
హెచ్చరిక..
మద్యం సేవించిన వారికి జలపాతం లోకి అనుమతి లేదని తేల్చి చెబుతున్న ములుగు జిల్లా అటవీ అధికారి ప్రదీప్ శెట్టి.. ఎవరైనా ఆకతాయిలు వచ్చిన పర్యాటకులకు ఇబ్బంది కలిగించినా అతి ఉత్సాహం ప్రదర్శించిన ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రదీప్ శెట్టి,జిల్లా ఫారెస్ట్ అధికారి(DFO):98493 58923 (ఫోన్ నెంబర్) నారాయణ, బోగత జలపాతం ఎఫ్బీవో(FBO) : (ఫోన్ నెంబర్) 9010628429
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.