(M. Venu, News 18, Mulugu)
వారాంతాల్లో కుటుంబంతో సరదాగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు (Tourist places) వెళ్తుంటారు ప్రజలు. ప్రధానంగా ఉరుకుల పరుగుల జీవితం నుండి కాస్త సేదతీరేందుకు ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నా నిరాశకు లోనవకుండా రెండు రోజుల పాటు తనివితీరా గడుపుతారు. అయితే అసలు సందర్శకులు రాకుండా పర్యాటక ప్రాంతాలనే మూసి ఉంచితే ఇక ఆ పర్యటనకు అర్ధం ఉంటుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. వాటిలో ముఖ్యంగా ములుగు (Mulugu) జిల్లా ప్రాంతంలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉండే కొన్ని జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తెలంగాణ నయాగరా జలపాతంగా చెప్పుకునే బొగత జలపాతాన్ని (Bogatha waterfalls) సందర్శించడానికి రోజు అనేకమంది పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ పర్యాటక ప్రదేశం ములుగు జిల్లా అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఉంటుంది. బోగత జలపాతాన్ని సందర్శించే సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ప్రాంతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉండడంతో అటవీశాఖ సిబ్బంది మాత్రం సమయాభావం పాటించకుండా ఉదయం 10 దాటినా జలపాతానికి వెళ్లే రహదారిని మూసి ఉంచుతున్నారు. వారాంతాల్లో బోగత జలపాతం చూసి సరదాగా గడపాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు తాళం వేసి ఉన్న గేట్లు దర్శనమిస్తున్నాయి.
బోగత జలపాతం (Bogatha Waterfalls) వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటుచేసిన స్విమ్మింగ్ పూల్ ఎంతో సందడిగా ఉంటుంది. చిన్నారులు కేరింతలు కొడుతూ సమయం తెలియకుండా సంతోషంగా గడుపుతుంటారు. తీరా ఇక్కడికి వచ్చాక జలపాతానికి వెళ్లే గేట్లు తీయకపోవడం పర్యాటకులలో తీవ్ర నిరాశ ఎదురవుతుంది. కనీస సమాచారం కోసం ఎవరికి ఫోన్ చేయాలో కూడా పర్యాటకులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. పర్యాటకశాఖ నెంబర్ గానీ, అటవీశాఖ నెంబర్ గానీ అందుబాటులో లేదు. దీంతో గేట్లు ఎప్పుడు తీస్తారో అర్థంకాక పర్యాటకులు అక్కడి నుంచి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
న్యూస్18 ప్రతినిధికి ఫోన్ చేసిన పర్యాటకులు: బోగత సందర్శనకు వచ్చిన పర్యాటకులు తమ సమస్యను చెప్పుకునేందుకు అక్కడ ఉన్న నోటీసుబోర్డులపై నెంబర్ కోసం వెతికారు. కానీ ఒక్క అధికారి నెంబర్ కూడా పర్యాటకులకు అందుబాటులో లేదు. గతంలో న్యూస్ 18 ప్రతినిధి ఈ ప్రాంతాన్ని సందర్శించిన విషయం తెలుసుకుని చివరికి తమ సమస్యను చెప్పుకునేందుకు న్యూస్ 18 ములుగు ప్రతినిధికి ఫోన్ చేశారు.
"సుదూర ప్రాంతం నుంచి జలపాతం సందర్శనకు వచ్చామని, కానీ ఇక్కడ సిబ్బంది కనిపించడం లేదని, గేట్లకు తాళాలు వేసి ఉన్నాయని" పర్యాటకులు తెలిపారు. ఈ విషయంపై న్యూస్ 18 ప్రతినిధి స్థానిక ఫారెస్ట్ రేంజ్ అధికారిని సంప్రదించే ప్రయత్నం చేయగా అధికారి అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు మేల్కొని పర్యాటకుల సౌకర్యార్ధం సంబంధిత అధికారి ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని, దీంతో పాటు సిబ్బంది కూడా సమయాభావం పాటించాలని పర్యాటకులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Tourist place