సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ అడవుల్లోనే షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారా?..మావోయిస్టులకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా? పోలీసులను మట్టు బెట్టడానికి మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారా లేక రాజకీయ నాయకులను మావోయిస్టులు టార్గెట్ చేశారా? ములుగు జిల్లాలో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలిస్తే పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ప్రస్తుతం తెలంగాణ అడవుల్లో షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తుంది. అందుకే వారిని కలవడం కోసం వెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం వెంకటాపురం మండలం రామచంద్రాపురం సమీపంలో పోలీసులు ఉదయం సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలోనే రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. వారి వాహనాల నుంచి పేలుడు పదార్థాలు, నిషేధిత విప్లవ సాహిత్యం, పోలీసులకు లభ్యమయ్యాయి. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. వారు ఆ పేలుడు పదార్థాలను మావోయిస్టు ప్రధాన నాయకుడు దామోదర్ ను కలిసి సామాగ్రిని ఇవ్వడానికి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీలో భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన అందే రవి, దీక్షకుంట గ్రామానికి చెందిన సత్యం, మండలం పెద్ద తండాకు చెందిన అనసూరి రాంబాబు,
వరంగల్ జిల్లాకు చెందిన శ్రీరామోజు మనోజు బిక్షపతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుండి 10 మీటర్ల వైరు, రెండు డిటోనేటర్లు, విప్లవ సాహిత్యం, బ్యాటరీలు, కారు, బైకు ఎనిమిది ఫోన్స్, రూ.4140 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను తయారు చేస్తున్న మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ కు చెందిన చంద్రమౌళి, పృథ్వీరాజ్, భూపాలపల్లి జిల్లా అందే మానసలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.
పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. అరెస్టు అయిన సానుభూతిపరులు మావోయిస్టు అగ్ర నేతలను కలవడానికి వెళ్తున్నామని, మధుమేహానికి సంబంధించిన మందులు, అలాగే పేలుడు పదార్థాలను అప్పజెప్పడానికి వెళ్తున్నారని చెప్తున్నారు. అంటే మావోయిస్టు అగ్ర నేతలు తెలంగాణ అడవుల్లోనే షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఎవరిని మట్టు పెట్టడం కోసం పథకాలు రచిస్తున్నారు? మావోల లక్ష్యం పోలీసులా.. రాజకీయ నాయకులా.. ఇలా ఎన్నో సందేహాలు ములుగు జిల్లా వాసులలో తలెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Maoist attack, Mulugu, Telangana