MULUGU ARABIAN BIRYANI IS IMPRESSING THE FOOD LOVERS IN ETURUNAGARAM AGENCY OF MULUGU DISTRICT SNR MMV BRV
Mulugu : అందమైన అడవిలో.. ఎడారి వంటల విందు.. అరబ్ మండీ.. తింటే వదలరు
(ఏజెన్సీలో అరబ్ మండి)
Mulugu: తక్కువ ధరకే మంచి ఫుడ్ దొరుకుతుండడంతో పాటు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వీలుగా ఉండడంతో వినియోగదారులు మండీలను ఇష్టపడుతున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ములుగు ఏజెన్సీలో అరబ్ మండి రుచులు పర్యాటకులను స్థానికులను ఆకర్షిస్తున్నాయి
(Venu Medipelly,News18,Mulugu)
ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వంటకాలతో వస్తుంటారు హోటల్స్(Hotels), రెస్టారెంట్స్(Restaurants)నిర్వాహకులు. వినియోగదారులను ఆకట్టుకొవాలంటే తమ వంటకాల్లో ఏదో ఒక ప్రత్యేకత చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దేశ విదేశాల్లోని ప్రముఖ వంటలను స్థానికంగా తమ వినియోగదారులకు అందించేందుకు నేటితరం హోటల్స్ నిర్వాహకులు తహతహలాడుతుంటారు. అలా ఆహార ప్రియులను వెతుకుంటూ ములుగు(Mulugu)జిల్లా ఏటూరునాగారం(Eturnagaram)కు వచ్చినవే 'అరబ్ మండి(Arab Mandi)' లేదా 'అరేబియన్ మండి' (Arabian mandi)హోటల్స్.
ములుగు ఏజెన్సీలో అరబ్ మండి రుచులు:
అరేబియన్ మండి వంటకాలు అరబ్ దేశాల నుంచి ఈ మధ్య కాలంలోనే మన దేశంలోకి వచ్చాయి. ముఖ్యంగా పెద్ద నగరాలలో కుప్పలు కుప్పలుగా అరబ్ మండి హోటల్స్ వెలిశాయి. తక్కువ ధరకే మంచి ఫుడ్ దొరుకుతుండడంతో పాటు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వీలుగా ఉండడంతో వినియోగదారులు మండీలను ఇష్టపడుతున్నారు. నగరాలూ పట్టణాలకే పరిమితమైన ఈ మండీలు ప్రస్తుతం ఏజెన్సీ ఏరియాకు చేరుకున్నాయి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ములుగు ఏజెన్సీలో అరబ్ మండి రుచులు పర్యాటకులను, స్థానికులను ఆకర్షిస్తున్నాయి. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్న ములుగు జిల్లాలో సరైన ఫుడ్ మాత్రం అందుబాటులో ఉండటం లేదు. బిర్యానీలు, ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ తప్ప వేరే వెరైటీ ఐటమ్స్ ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో లేవు. ములుగు జిల్లా కేంద్రంలో కూడా కేవలం బిర్యాని ఐటమ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ములుగు జిల్లా కేంద్రంలో కూడా లభించని అరబ్ మండి వంటకాలు ఇప్పుడు మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఏటూరునాగారంలో అందుబాటులో ఉన్నాయి.
సొంత ఊరిలో అరేబియన్ మండి ఏర్పాటు చేసిన యువకుడు:
ములుగు జిల్లా ఏటూరునాగారంకు చెందిన సల్మాన్ అనే యువకుడు ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన సల్మాన్..తిరిగి సొంత ఊరు ఏటూరునాగరం చేరుకున్నాడు. సౌదీలో ఉద్యోగం చేసిన సల్మాన్..అక్కడకు తిరిగి వెళ్లే ఆలోచన లేక సొంత ఊరిలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. అప్పుడే ఈ అరబ్ మండి ఆలోచన వచ్చింది. సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ మండీలు ఎంతో ఫేమస్. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ అరబ్ మండి రుచులను ఏజెన్సీ వాసులకు అందించాలనుకున్నాడు సల్మాన్. ఏటూరునాగారం ప్రాంతం ఇప్పుడిప్పుడే టూరిజం హబ్‌గా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ ఫుడ్ నచ్చుతుందని భావించి అరబ్ మండి ఏర్పాటు చేశాడు. కొత్త ప్రాంతం కొత్త రకమైన ఫుడ్ కొత్త మనుషులకు ఈ రుచి అందించాలని ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సెంటర్ పెట్టినట్టు సల్మాన్ చెప్తున్నాడు.
కొత్త అనుభూతి బాగుందన్న కస్టమర్లు:
అనేక పర్యాటక ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో ఈ ఫుడ్ దొరకడం ఫుడ్ లవర్స్‌కి ఒక చక్కని అనుభూతిగా చెప్పవచ్చు. ఏటూరునాగారం చుట్టుపక్కలలో 30 గ్రామాలు ఉంటాయి. రోజువారీ పనులు నిమిత్తం అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. భోజన సమయంలో ఈ కొత్త రకమైన వంటకం తినే అవకాశం ఉంటుంది. ఇక్కడ రుచి కూడా బాగానే ఉందని సెంటర్‌కు వస్తున్న వినియోగదారులు చెబుతున్నారు. 'సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కేవలం చికెన్ బిర్యాని, ఇతర బిర్యానీ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేవి. కానీ ఈ అరబ్ మండి సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది' అని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. నగరాలలోని అరబ్ మండిలలో ఒక్కో ప్లేట్ ధర రూ. 300 నుంచి రూ. 350 వరకు ఉంటుందని, మా సెంటర్లో మాత్రం కేవలం రూ. 250కే ప్లేట్ మండి అందుబాటులో ఉంటుందని సల్మాన్ అంటున్నాడు.
ఎక్కడుందంటే ..
బొగత జలపాతం, కొంగల, ముత్యాల ధార జలపాతాలకు వెళ్లే మార్గంలో ఈ అరబ్ మండి సెంటర్‌ని ఏర్పాటు చేశారు.ఏటూరునాగారం వై జంక్షన్ వద్ద అరబ్స్ మండి ఉంటుంది. సల్మాన్, అరబ్ మండి నిర్వాహకుడు, 7093057403
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.