రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లొకేషన్ : కొత్తగూడ
తెలంగాణ రాష్ట్రం అనేక వైవిధ్యభరిత సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అనేక గిరిజన జాతరలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. నేటికీ చరిత్ర ఆనవాళ్లు, సంప్రదాయాలు, ఇలవేల్పుల నమ్మకాలు సజీవంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర గురించి మనం మాట్లాడుకుంటే కేవలం కుంకుమ భరిణ మన దేవతల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని లక్షల మంది మేడారం జాతరను సందర్శిస్తూ ఉంటారు. కానీ విశేషమేమిటంటే గుడికాని గోపురం గాని ఏమీ కనిపించదు. అక్కడ వనదేవతలపైన ఉన్న నమ్మకమే భక్తులు మేడారం జాతరకు తండోపతండాలుగా వస్తూ ఉంటారు.
ఇలాంటి జాతరలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట కొత్తగూడా ఏజెన్సీలో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఏ దేవత కొలువై ఉంది? ఏ దేవత ఇక్కడి భక్తులకు కొంగుబంగారమై నిలిచింది?
వరంగల్ జిల్లా నర్సంపేట కొత్తగూడా ఏజెన్సీ అటవీ ప్రాంతంలో గుంజేడు ముసలమ్మ జాతర చాలా ప్రసిద్ధి చెందిన జాతర. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో గుంజేడు ముసలమ్మ కొలువై ఉంది. ఈ జాతరకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ గుంజేడు ముసలమ్మ దేవతను తొలేం వంశస్థులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. గుంజేడు ముసలమ్మను మేడారం సమ్మక్క అక్కచెల్లెలని ఇక్కడ కొందరు భావిస్తూ ఉంటారు. ఈ జాతర 1995 నుండి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. గుంజేడు ముసలమ్మ జాతరకు ప్రతి శుక్రవారం అనేకమంది భక్తులు వస్తూ ఉంటారు.
గుంజేడు ముసలమ్మ చరిత్ర..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోప్రాచీన కాలం నుంచి గుంజేడు ముసలమ్మ దేవత కొలువుదిరింది. గుంజేడ గ్రామంలో గిరిజన తెగకు చెందిన తోలెం వంశస్థులు గుంజేడు ముసలమ్మ దేవతలు ప్రతిష్ట చేసినట్లు ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. గుంజేడు ముసలమ్మ దేవత నేటి చతిస్గడ్ రాష్ట్రంలోని భాస్కర్ జిల్లా అటవీ ప్రాంతంలో గిరిజన దంపతులకు జన్మించారని గిరిజనులు చెప్తుంటారు. గుంజేడు ముసలమ్మ దేవత కుటుంబీకులు బ్రతుకుతెరువు కోసం భస్తర్ జిల్లా అటవీ ప్రాంతం నుండి బయలుదేరి గోదావరి నది తీరం దాటి తెలంగాణలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వచ్చారని చెప్పుకుంటారు.
ముసలమ్మ దేవత గుంజేడు ప్రాంతంలోని ముసలమ్మ బాగు వద్ద మరణించినట్లు ఇక్కడ గిరిజనులు చెప్పుకుంటారు. గుంజేడు ముసలమ్మ చరిత్ర వివరంగా గుంజేడు ముసలమ్మ దేవాలయంలో లిఖించబడి ఉంది. గుంజేడు దేవాలయాన్ని చేరుకోవాలంటే మహబూబాబాద్ జిల్లా నర్సంపేట కేంద్రం గుండా కొత్తగూడా మండలానికి చేరుకొని గుంజేడు ముసలమ్మ జాతరకు చేరుకోవచ్చు. గుంజేడు ముసలమ్మ ఆలయ పూజారి ఫోన్ నెంబర్ 9553805100 (తోలెం వెంకన్న)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana