Venu, News18, Mulugu
మేడారం మినీ జాతర (Medaram Mini Jathara) ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు మేడారం క్యూ కడుతున్నారు. వీకెండ్ సెలవులు వచ్చాయంటే చాలు వాహనాలన్నీ మేడారం వైపే వెళుతున్నాయి. మేడారం మినీ జాతరకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మేడారం భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. చుట్టుపక్కల అటవీ ప్రాంతం మొత్తం వనదేవత భక్తులతో నిండిపోయింది. ఫిబ్రవరి 1 నుంచి మేడారం మినీ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలను ఆచరించి అమ్మవార్లకు ఇష్టమైన బంగారం ( బెల్లం), ఒడి బియ్యం చీరే సారా పండ్లు పూలు సమర్పిస్తున్నారు. అనేకమంది భక్తులు తమ సంతానానికి మేడారం మనదేవతలకు పుట్టు వెంట్రుకలు మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం జాతరకు చేరుకోవడానికి టిఎస్ఆర్టిసి సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం మినీ జాతరకు సంబంధించి ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులు మేడారం విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. వీకెండ్ సెలవులలో దాదాపు 25 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలీస్ ఆన్ డ్యూటీ..
మేడారం ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పోలీస్ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ముఖ్యంగా మేడారంకు అనేక ప్రైవేట్ వాహనాలు వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు తరలించడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వనదేవతల గద్దెల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. గతంలో జరిగిన దొంగతనాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు ఎలాంటి దొంగతనాలు జరగకుండా చూడడానికి ముందే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
జంపన్న వాగు సమీపంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం కోసం బ్యాటరీ ఆఫ్ పంప్స్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అధికారులు జాతరకు వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టులు తెలుస్తుంది. జాతర సమయంలో ప్రముఖ వ్యక్తులు, అధికారులు కూడా అమ్మవాళ్లను దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Medaram jatara, Mulugu, Telangana