హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: అడవిలో సివంగులు: మావోయిస్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ 

Mulugu: అడవిలో సివంగులు: మావోయిస్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ 

ములుగు

ములుగు ఏజెన్సీలో మహిళా పోలీసులు

తెలంగాణ (Telangana) సరిహద్దు ప్రాంతాలలో మళ్ళీ మావోయిస్టుల అలజడి మొదలైంది. భూపాల‌పల్లి జిల్లా (Bhupalapalli District) లో మావోయిస్టు సానుభూతిపరుని పోలీసులు అరెస్ట్ చేయగా, మరొక దళ సభ్యుడు స్వచ్ఛందంగా సరెండర్ అయ్యాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  తెలంగాణ (Telangana) సరిహద్దు ప్రాంతాలలో మళ్ళీ మావోయిస్టుల అలజడి మొదలైంది. భూపాల‌పల్లి జిల్లా (Bhupalapalli District) లో మావోయిస్టు సానుభూతిపరుని పోలీసులు అరెస్ట్ చేయగా, మరొక దళ సభ్యుడు స్వచ్ఛందంగా సరెండర్ అయ్యాడు. దండకారణ్యంలో మావోయిస్టుల వారోత్సవాల నిర్వహణ నేపథ్యంలో మావోయిస్టు అగ్ర నేతలు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఉండగా... ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ గ్రామ ప్రజల్లో భయాందోళన నెలకొంది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 28 మంది మహిళా పోలీసులు సమర్థవంతంగా గస్తీ నిర్వహిస్తున్నారు. దండకారణ్యంలోని గుత్తి కోయ గ్రామాల పరిసర ప్రాంతాలను అణువణువు జల్లెడ పడుతూ వారితో మమేకమై ఈ మహిళా పోలీసులు చేస్తున్న కృషిని ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. వీరికి వెన్ను దన్నుగా నిలిచిన వెంకటాపూర్ ఎస్‌హెచ్‌ఓ తాజుద్దీన్ అధికారులతో ప్రశంసలు అందుకుంటున్నాడు.

  ములుగు జిల్లా (Mulugu District) వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ‌కు నిత్యం కొన్ని వందల మంది న్యాయం కోసం వస్తుంటారు. ఇక్కడ పోలీస్ డ్యూటీ నిర్వహించాలంటే ఎంతో ఓపిక ధైర్యం అవసరం. గతంలో ఒకసారి ఈ పోలీస్ స్టేషన్ ‌పై మావోల దాడి కూడా జరిగింది. అలాంటి స్టేషన్లో ప్రస్తుతం 28 మంది మహిళ పోలీసులే విధులు నిర్వహిస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఇతర మహిళా పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్టేషన్ మొత్తం ఒక ఎస్.‌హెచ్‌ఓ, ఇద్దరు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, 28 మంది పీసీ సిబ్బంది మొత్తం కలిపితే 33 మంది సిబ్బంది ఉన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే 28 మంది పోలీసులు కూడా అందరూ మహిళలే. వారందరూ కూడా 2020 బ్యాచ్‌కి చెందిన యువ మహిళలే. దీంతో పాటు అక్కడ ఎస్.‌హెచ్.ఓగా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ‌గా ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నారు.

  ఇది చదవండి: తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండాలనుకున్నాడు, కానీ కడుపుకోత మిగిల్చాడు

  యువ ఆఫీసర్లతో ఆ పోలీస్ స్టేషన్ 24/7 సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళా పోలీస్ ఆఫీసర్లు కీలకపాత్ర పోషించారు. గతంలో సిటీ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన వీరు 317 జీవో ప్రకారం ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ విధులు నిర్వహించాలంటే ఎంతో ఓపిక, ధైర్యం అవసరం. ఇక్కడ విధులు నిర్వహిస్తుంటే ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారిని రక్షిస్తూ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని మహిళా పోలీసులు చెప్తున్నారు.

  ఇది చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు.. అసలు నిజం తెలిసి షాకైన అధికారులు

  స్టేషన్ మొత్తం మహిళ పోలీసులతో నిండిపోయింది. సమస్యలను నివారించడంలో, మావోయిస్టుల కదలికల సమయంలో వీరు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి న్యూస్ 18 స్టేషన్ ఆఫీసర్ తాజుద్దీన్‌ని ప్రశ్నించింది. ఆయన చెప్పిన మాటల ప్రకారం "వారందరూ టైంపాస్ కోసం ఉద్యోగంలో చేరిన వారు కాదు, చాలా కష్టపడి.. ఒక పూట పస్తులుండి మరో పూట చదువుకొని, పోలీస్ గ్రౌండ్‌లో అన్ని విధాలుగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. కేవలం మహిళా పోలీసులతో కూంబింగ్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నామంటే వారు ఎంత ధైర్యంగా ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి" అని వివరించారు. "దండకారణ్యంలో ఉన్న గుత్తికోయ గ్రామాలకు వెళ్ళి అక్కడ గిరిజనులతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని, వారిని మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా మా మహిళా కానిస్టేబుల్స్ మాట్లాడడం ఎంతో నచ్చిందని... నిజానికి వారందరూ నా స్టేషన్లో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని" సబ్ ఇన్ స్పెక్టర్ న్యూస్18కి వివరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు