Home /News /telangana /

MULUGU ADVOCATE MURDER IN MULUGU DISTRICT POLICE ON HUNT TO NAB THE MURDERERS MMV ABH BRV

Mulugu: నడిరోడ్డు మీద కారుతో ఢీకొట్టి, కత్తులతో వెంటాడి.. న్యాయవాదిని దారుణంగా...

హత్యోదంతంతో ఉలిక్కిపడ్డ ములుగు జిల్లా

హత్యోదంతంతో ఉలిక్కిపడ్డ ములుగు జిల్లా

ములుగు జిల్లాలో న్యాయవాది మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రశాంతమైన ఏజెన్సీ ఏరియాలో హత్య జరగడం ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుర్తుతెలియని ఐదుగురు దుండగులు న్యాయవాది మల్లారెడ్డిని వెంటాడి వేటాడి హతమార్చారు.

    (M.venu, News 18, Mulugu)

    ములుగు జిల్లాలో న్యాయవాది మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రశాంతమైన ఏజెన్సీ ఏరియాలో హత్య జరగడం ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుర్తుతెలియని ఐదుగురు దుండగులు న్యాయవాది మల్లారెడ్డిని వెంటాడి వేటాడి హతమార్చారు. మైనింగ్ మరియు భూ తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రేగొండకు చెందిన మల్లారెడ్డి గత 30 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నాడు. మల్లారెడ్డి ప్రస్తుతం హనుమకొండలో శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు మల్లంపల్లి ప్రాంతంలో మైనింగ్ తో పాటు పెట్రోల్ పంపు కూడా ఉన్నట్లు సమాచారం.

    అసలు ఏం జరిగింది!...

    మల్లారెడ్డి తన వాహనంలో ములుగులో పని ముగించుకుని హన్మకొండ బయలుదేరాడు. జాకారం స్టేజి తర్వాత మల్లంపల్లి వరకు దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతం నుంచి వెళ్లే 163వ జాతీయ రహదారి కొంత నిర్మానుష్యంగా ఉంటుంది. పందికుంట స్టేజ్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో న్యాయవాది ప్రయాణించే కారు వేగాన్ని తగ్గించి స్పీడ్ బ్రేకర్లను దాటింది. ఈక్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక వాహనం ఒక్కసారిగా న్యాయవాది వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వెంటనే న్యాయవాది మల్లారెడ్డి తన కారును పక్కకు ఆపి వెనుక ఉన్న కారు డ్రైవర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఢీ కొట్టిన కారు నుంచి బయటకు దిగిన వ్యక్తి... మద్యం సేవించి ఉన్నామని, పొరపాటున ప్రమాదం జరిగిందని చెబుతుండగానే అక్కడే ఉన్న మరో ఐదుగురు దుండగులు దిగి న్యాయవాదిపై దాడి చేశారు. వెంటనే మల్లారెడ్డి ప్రాణభయంతో తప్పించుకునే ప్రయత్నం చేయగా, దుండగులు వెంటాడి వేటాడి మరి మల్లారెడ్డి పై ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇదంతా మల్లారెడ్డి వాహనం డ్రైవర్ సారంగం చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోయింది.

    అసలు కారణం!...

    న్యాయవాది మల్లారెడ్డి హత్యకు ప్రధాన కారణం మైనింగ్ తో పాటు భూ వివాదాలే అని తెలిసింది. మల్లారెడ్డిని హతమార్చిన దుండగులు ఎవరైనా సుపారి ఇచ్చి హత్యకు ప్రణాళిక వేశారా అనే సందేహం కలుగుతుంది. మల్లంపల్లిలో ఉండే ఎర్రమట్టి ఖనిజ సంపదకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఇక్కడ న్యాయవాది మల్లారెడ్డికి భూమి ఉండడంతో పాటు అనేక వివాదాలతో మల్లారెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.

    కీలకంగా మారిన డ్రైవర్ వాంగ్మూలం:

    న్యాయవాది మల్లారెడ్డి వాహన డ్రైవర్ సారంగం.. వాంగ్మూలం ఈ ఘటనలో కీలకం కానుంది. దాడి చేసిన దుండగులు ఎవరు? ఎలా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన ఏకైక వ్యక్తి సారంగం మాత్రమే. వచ్చిన దుండగులను మళ్లీ చూస్తే తప్పకుండా గుర్తిస్తానని సారంగం పోలీసులతో అన్నారు.

    రంగంలోకి దిగిన ములుగు పోలీసులు:

    గొడవలకు, నేరాలకు దూరంగా... ప్రశాంతతకు దగ్గరగా ఉంటుంది ములుగు జిల్లా. ఈక్రమంలో సోమవారం ఒక్కసారిగా ఈ హత్య ఘటనతో ములుగు జిల్లా ఉలిక్కిపడింది. ఘటన స్థలానికి చేరుకున్న ములుగు పోలీస్ అధికారులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. న్యాయవాది మల్లారెడ్డి సోమవారం ములుగులో ఎక్కడెక్కడ సంచరించారు? ఎవరితో మాట్లాడారు? అనే వివరాలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సీసీ కెమెరాల ఆధారంగా కూడా విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Mulugu, Telangana

    తదుపరి వార్తలు