Home /News /telangana /

MULUGU A TRIBAL YOUNG MAN TEACHING FREE PRIMARY CLASSES FOR TRIBAL CHILDREN IN MULUGU DISTRICT MMV BRV ABH

Mulugu: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన గూడెంలో విద్యా కుసుమాలు పూయిస్తున్న యువకుడు!

గిరిజన

గిరిజన చిన్నారులకు ఉచితంగా పాఠాలు చెబుతున్న యువకుడు 

ఆ చిన్నారుల చూపులు ఒక గిరిజన యువకుడిని కదిలించాయి. మీతో పాటు పిల్లల్ని ఎందుకు పనికి తీసుకొస్తున్నారు బడికి పంపొచ్చు కదా? అని ఆ యువకుడు వెళ్లి వారి తల్లిదండ్రులను ప్రశ్నించాడు. అందుకు వారు చెప్పిన సమాధానం

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M.Venu, News 18, Mulugu)

    సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా...మారుమూల గ్రామాల్లో నివసించే ఆదివాసీ పిల్లలు ఇంకా చదువులకు దూరంగా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. గ్రహాంతరాలకు మనుషులను పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేటి యుగంలో చదువు అనే మాటకు దరిదాపుల్లో కూడా లేరు ఆ గిరిజన చిన్నారులు. ములుగు జిల్లాలో మద్దిమడుగు అనే చిన్న గుత్తికోయ గూడెం. బయట ప్రపంచానికి దూరంగా, దట్టమైన అటవీ ప్రాంతంలో 35 కుటుంబాలతో 200 మందికి పైగా నివసించే ఒక చిన్న ఆదివాసీ గుంపు గూడెం. గ్రామంలో పెద్దలు పొట్టకూటి కోసం రోజువారి కూలీలుగా సమీప గ్రామాల్లో పొలం పని చేస్తుంటారు. వారి పిల్లలు కూడా వారితో పాటే పనికి వెళ్ళిన చోట తల్లిదండ్రులు పనిచేస్తుంటే ఏమి చేయాలో తెలియక పని జరిగే ప్రదేశాలలో నిస్సాయంగా కూర్చుండి చూస్తూ ఉంటారు.ఆ చిన్నారుల చూపులు ఒక గిరిజన యువకుడిని కదిలించాయి. మీతో పాటు పిల్లల్ని ఎందుకు పనికి తీసుకొస్తున్నారు బడికి పంపొచ్చు కదా? అని ఆ యువకుడు వెళ్లి వారి తల్లిదండ్రులను ప్రశ్నించాడు. అందుకు వారు చెప్పిన సమాధానం ఆ యువకుడిని కదిలించింది.

    "మా గుంపులో దాదాపు 40 మంది పిల్లలు ఉంటారు. వారిని బడికి పంపాలని మాకు ఎంతో ఆశ ఉంటుంది. కానీ అటవీ ప్రాంతంలో నివసించే మాకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు పిల్లల్ని పంపడం ఇబ్బందిగా ఉంది. చేసేదేమి లేక మాతో పాటే పనుల్లోకి తీసుకు వస్తున్నాం" అని చెప్పారు. వారి మాటలకూ ఆలోచనలో పడ్డ ఆ గిరిజన యువకుడు ఆ చిన్నారులకు తన వంతుగా ఏదో ఒక సహాయం చేయాలని భావించాడు. చెట్లు పుట్టలు తప్ప మరేమి తెలియాని ఆ చిన్నారులకు బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ పాఠశాలల్లో చేర్పించాలనే ఆలోచన వచ్చింది.

    ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన బంగారు మురళీకృష్ణ డిగ్రీ చదువుతున్నాడు. ఆదివాసి పిల్లల బాల్యం బడికి దూరంగా వృధాగా గడిచిపోతుందనే భావనతో వారికి నాలుగు అక్షరాలు నేర్పించాలని సంకల్పించుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన సొంత ఖర్చులతో వారి గూడెంలోనే ఒక చిన్న పాఠశాలను ఏర్పాటు చేశాడు. గిరిజన కుటుంబాలతో మాట్లాడి.. గూడెంలోని పిల్లలందరికీ చదువు చెప్తానని, ఇక్కడ కొంత చదువు నేర్చుకున్న తర్వాత పైచదువుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తానని చెప్పాడు. అక్కడే ఉంటూ ఆ గిరిజన చిన్నారులకు అక్షరాలను నేర్పుతున్నాడు. ఉదయం పనులకు వెళ్లే తల్లిదండ్రులు.. వారి పిల్లల్ని ఇక్కడి పాఠశాలలో యువకుడికి అప్పజెప్పి సంతోషంగా వెళుతున్నారు.

    మురళీకృష్ణను పలకరించిన న్యూస్ 18: దట్టమైన అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుంపుకు వెళ్లిన న్యూస్ 18 ప్రతినిధి.. అక్కడ పాటలు చెప్తున్న గిరిజన యువకుడితో మాట్లాడింది. గిరిజన చిన్నారులకు పాఠాలు నేర్పించి, వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా.. సాటి గిరిజన యువకుడిగా తన వంతు కృషిచేస్తున్నట్లు మురళీకృష్ణ పేర్కొన్నాడు. వీరి నుంచి ఎటువంటి డబ్బు, ప్రతిఫలం ఆశించకుండా, కేవలం ఆ చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అతను తెలిపాడు. చిన్నారులకు తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలు, ఇంగ్లీష్ అక్షరాలు నేర్పిస్తున్నాడు.

    12 సంవత్సరాల నుంచి అటవీ ప్రాంతంలోనే: మద్దిమడుగు అనే గిరిజన గూడెం పసర కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉంటుంది. సుమారు 30 ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. దాదాపు 12 సంవత్సరాల క్రితం వీరు ఇక్కడికి వలస వచ్చారు. కానీ గూడెంలో సగం మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవు. వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్న ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవు. ఇప్పటికైనా తమకు ప్రభుత్వం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పిస్తే తమ పిల్లల్ని ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం పాఠశాలల్లో చేర్పించుకుంటామని తల్లిదండ్రులు చెప్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: EDUCATION, Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు