Venu, News18, Mulugu
వారందరూ పాఠశాల విద్యార్థులు.. ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు.. వారికి తెలిసిందల్లా ఉదయం పాఠశాలకు వెళ్లడం.. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడం.. చదువుకోవడం మరలా సాయంత్రం ఇంటికి వెళ్లడం. వారి తల్లిదండ్రుల జీవితాలూ అంతే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు వ్యవసాయం పనులపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఉదయం లేచిన అనంతరం పిల్లల్ని స్కూలుకి పంపి వ్యవసాయ పనులకు వెళ్లడం రోజు దినచర్యంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా తల్లిదండ్రులకు ఫోన్ మీ పిల్లలు పాఠశాలలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో ఉన్నారని. వెంటనే తల్లిదండ్రుల గుండెలు అలిగినంత పనైపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. హుటాహుటిన ములుగు సామాజిక ఆసుపత్రికి వచ్చారు.
అసలు ఏం జరిగింది? పిల్లలకు పురుగుల మందు ఎక్కడి నుంచి వచ్చింది? ములుగు జిల్లా (Mulugu District) వ్యాప్తంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. ముగ్గురు చిన్నారులు క్రిమి సంహారక మందు తాగిన ఘటన అందరిని కలిసివేసింది. అదృష్టం కొద్దీ పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ఊహించుకోవడానికి మనసు రావడం లేదు. అలాంటి ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
ఇంతకీ పాఠశాలలో ఏం జరిగింది..?
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డెర గూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఐశ్వర్య, నాలుగో తరగతి చదివే అక్షర, అఖిల ముగ్గురు చిన్నారులు కూల్ డ్రింక్ అనుకొని బాటిల్ లో ఉన్న క్రిమిసంహారక మందు తాగారు. వీరు యధావిధిగా రోజువారిగానే పాఠశాలకు వెళ్లారు.. పిల్లలతో కలిసి ఆడుకున్నారు.. చదువుకున్నారు. మధ్యాహ్నం భోజనంలో భాగంగా ముగ్గురు విద్యార్థులు భోజనం చేశారు.
భోజనం అనంతరం ముగ్గురు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు ఏడుస్తున్న విషయం ప్రధానోపాధ్యాయులకు తెలిసింది. వెంటనే విద్యార్థుల వద్దకు చేరుకున్న ప్రధాన ఉపాధ్యాయుడు ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నించగా భోజనం చేసిన అనంతరం అక్షర బ్యాగులో ఉన్న బాటిల్లోని కూల్ డ్రింక్ తాగామని పిల్లలు చెప్పారు. కూల్ డ్రింక్ తాగితే ఎందుకు ఏడుస్తారు అనే అనుమానంతో ఉపాధ్యాయుడు బాటిల్ని పరీక్షించగా కూల్ డ్రింక్ బాటిల్ దుర్వాసన వస్తుంది. పిల్లలు తాగింది కూల్ డ్రింక్ కాదు ఏదో క్రిమిసంహారక మందు అని తెలుసుకున్న ఉపాధ్యాయుడు వెంటనే వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు.
ఈ విషయాన్ని వెంటనే పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రికి చేరుకున్నారు. స్కూల్ పిల్లల బ్యాగులో కూల్ డ్రింక్ బాటిల్ ఏ విధంగా వచ్చింది? ఎవరు పెట్టారని విద్యార్థుల తల్లిదండ్రులను అడగగా మాకు ఏమీ తెలీదు రోజువారి లాగే పిల్లల్ని రెఢీ చేసి స్కూల్ కి పంపి మేము వ్యవసాయం పనులకు వెళ్లిపోయామని చెప్తున్నారు. మరి ఇంతకీ పిల్లల బ్యాగులోకి క్రింది సంహారక మందు ఏ విధంగా వచ్చింది? స్కూల్ పిల్లలు కావాలని క్రిమిసంహారకమందు సేవించారా? పిల్లల్ని ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తున్నారా? పిల్లలకు సంబంధించిన కుటుంబాలలో కుటుంబ కలహాలు రావడంతో పురుగుల మందు కూల్ డ్రింక్బాటిల్లో పోసుకున్నారా? అనే ఎన్నో సందేహాలు ఈ ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. అదృష్టం మేరకు పిల్లల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఈ ఘటన ములుగు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana